
లేపాక్షిలో కేంద్ర బృందం పర్యటన
లేపాక్షి: స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్–2025లో భాగంగా కేంద్ర బృందం సభ్యులు రామాంజనేయులు, అనంత్ గురువారం లేపాక్షిలో పర్యటించారు. మురుగునీటి కాలువలు, పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించారు. చెత్తను బయట వేయరాదని, ప్లాస్టిక్ వాడరాదని, స్వచ్ఛమైన నీరు సేవించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహమూర్తి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
పట్టపగలే రెండిళ్లలో చోరీ
మడకశిర: స్థానిక పావగడ రోడ్డులోని రెండు ఇళ్లలో పట్టపగలే చోరీ జరిగింది. ఆర్టీసీ బస్డాండ్ సమీపంలో నివాసముంటున్న కొలిమి నాగేంద్ర గురువారం ఉదయం 11గంటల సమయంలో ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి పనిపై బ్యాంకుకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని ఇంటికి వచ్చే లోపు తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో దాచిన రూ.70 వేల నగదు, జత బంగారు కమ్మలు, ఓ ఉంగరం అపహరించినట్లుగా గుర్తించి, సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు.
● నాగేంద్ర ఇంటి పక్కనే మేడపై నివాసముంటున్న శకుంతల ఇంట్లోనూ చోరీ జరిగింది. పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో పనిచేస్తున్న ఆమె గురువారం ఉదయం 7 గంటలకు ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లిపోయారు. ఆ సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు వస్తువులను చెల్లాచెదురు చేసి బంగారు నగలు అపహరించారు. కాగా, ఇంటి యజమానురాలు వచ్చి ఎంత మేర సొత్తు చోరీ అయింది నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇప్పటికే నాగేంద్ర ఫిర్యాదు స్వీకరించామని, శకుంతల వచ్చిన తర్వాత ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామని సీఐ నగేష్‌బాబు తెలిపారు. క్లూస్‌టీంను రంగంలో దించి దొంగల వేలి ముద్రలను సేకరించినట్లు తెలిపారు.
వేధింపులపై యువతి ఫిర్యాదు
ధర్మవరం రూరల్: తనను ధర్మవరం మండలం తుంపర్తి గ్రామానికి చెందిన ప్రణవ్ అనే యువకుడు వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసింది. వివరాలు.. ధర్మవరం పట్టణంలోని శివానగర్‌కు చెందిన ఓ యువతి బీటెక్ పూర్తి చేసి, పోటీ పరీక్షలకు హైదరాబాద్‌లోని కోచింగ్ తీసుకుంటోంది. అక్కడే తన స్నేహితురాలి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ప్రణవ్ పరిచయమయ్యాడు. అనంతరం తరచూ పోన్ చేస్తుండేవాడు. ఆమె ఉంటున్న హాస్టల్ వద్దకూ వెళుతుండేవాడు. ఈ క్రమంలో తాను ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతూ అసభ్యంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పినా వినకుండా వెంటపడేవాడు. వారం రోజుల క్రితం యువతి హైదరాబాద్ నుంచి ధర్మవరానికి చేరుకుంది. అయిన ప్రణవ్ వదలకుండా ఇతరుల ఫోన్ నుంచి కాల్స్ చేయడంతో పాటు అసభ్యంగా మెసేజ్‌లు పెడుతూ వచ్చాడు. తాను చెప్పినట్లుగా నడుచుకోకపోతే హతమారుస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో విషయాన్ని తల్లిదండ్రలకు తెలిపి వారి సమక్షంలో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు ధర్మవరం రెండో పట్టణ పోలీసులు తెలిపారు.