
నేడు రైల్వే ఇన్‌స్టిట్యూట్ పాలక వర్గం ఎన్నికలు
గుంతకల్లు: స్థానిక రైల్వే ఇన్‌స్టిట్యూట్ పాలక మండలి ఎన్నికలు శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు సీనియర్ డీపీఓ కోర్డినేషన్ హెచ్‌ఎల్‌ఎన్ ప్రసాద్ గురువారం వెల్లడించారు. రెండేళ్ల కాల వ్యవధి ఉన్న రైల్వే ఇన్‌స్టిట్యూట్ పాలక మండలికి నిర్వహించే ఈ ఎన్నికల్లో కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారితో పాటు ఆరుగురు సభ్యులను రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకోనున్నారు. గుంతకల్లు రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో మొత్తం 943 మంది ఓటర్లు ఉన్నారు. శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు రైల్వే ఇన్‌స్టిట్యూట్ పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. అనంతరం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి, వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. కాగా, ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ మజ్దూరు యూనియన్, ఎంప్లాయీస్ సంఘ్ మధ్యనే ఉంది. మజ్దూర్ యూనియన్ తరఫున కార్యదర్శిగా కె.యల్లప్ప, సంయుక్త కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్, కోశాధికారిగా ఎస్.సతానియల్‌తోపాటు ఆరుగురు కమిటీ సభ్యులుగా పోటీ చేస్తున్నారు. ఎంప్లాయీస్ సంఘ్ తరపున కార్యదర్శిగా మల్లికార్జున, సంయుక్త కార్యదర్శిగా షెక్షావలి, కోశాధికారిగా నాగరాజుతోపాటు ఆరుగురు కమిటీ సభ్యులుగా బరిలో నిలిచారు. కాగా డివిజన్ వ్యాప్తంగా ఇప్పటి వరకూ జరిగిన రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఎన్నికల్లో మజ్దూర్ యూనియన్ హవా కొనసాగింది. పాకాల రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో యూనియన్ 6 పోస్టులు, సంఘ్ 3 పోస్టులు కై వసం చేసుకుంది. ఇక రేణిగుంట, నందలూరు, కడప ఇన్‌స్టిట్యూట్ పాలక మండళ్లను మజ్దూర్ యూనియన్ ఏకగ్రీవంగా కై వసం చేసుకుంది. గుత్తి రైల్వేఇన్‌స్టిట్యూట్‌లో క్లీన్ స్వీప్ చేసింది.