
చోరీలపై అప్రమత్తంగా ఉండండి : డీఎస్పీ
కదిరి అర్బన్: చోరీలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి సూచించారు. పట్టణ పోలీస్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొబేషనరీ డీఎస్పీ ఉదయపావనితో కలసి ఆయన మాట్లాడారు. జిల్లాలో మధ్యప్రదేశ్ చెందిన చెడ్డీ, పార్థీ, బిళ్లూ గ్యాంగ్‌లతో పాటు నంద్యాలకు చెందిన చెంచు జాతి దొంగల సంచారం ఎక్కువగా ఉందన్నారు. ఈ ముఠాలు జిల్లాలోని పుట్టపర్తి, గాండ్లపెంట, ధర్మవరం, రాప్తాడు, తిరుపతి, కర్ణాటకలోని గౌరీబిదనూర్‌లో చోరీలకు పాల్పడ్డాయన్నారు. వీరు రాత్రి 12 నుంచి 3 గంటల మధ్య విశాలమైన పెద్ద ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుంటారన్నారు. కదిరిలోని ఎన్‌జీఓ కాలనీ, వాణి స్ట్రీట్, మగ్గాల క్వార్టర్స్, సైదాపురం, వైఎస్సార్ నగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చోరీలను అరికట్టేందుకు రాత్రి గస్తీలు ముమ్మరం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు కూడా ఇందుకు సహకరించాలన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తుల సంచారం ఉంటే డయల్ 100, టౌన్ సీఐ 94407 96851 కు సమాచారం అందించాలని కోరారు. అనంతరం పెట్రోలింగ్ కోసం నూతనంగా ఏర్పాటు చేసిన మూడు ద్విచక్ర వాహనాలను ప్రారంభించారు.