
ఎరువుల దుకాణంలో విజిలెన్స్ తనిఖీలు
బత్తలపల్లి: మండలంలోని పలు ఎరువుల దుకాణాలను విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీ చేశారు. పుంగనూరు ఏడీఏ శివకుమార్, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ ఎం.శివన్న, వ్యవసాయాధికారి ప్రసాద్, బత్తలపల్లి ఏఓ ఓబిరెడ్డి పాల్గొన్నారు. పలు రికార్డులు, నిల్వలు పరిశీలించారు. నిల్వల్లో వ్యత్యాసమున్న రూ.3.05 లక్షల విలువైన 15.105 మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయాలను నిలుపుదల చేస్తూ నోటీసులు ఇచ్చారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల విక్రయాలకు సంబంధించి ప్రతి రైతుకూ తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించారు. కాగా, విజిలెన్స్ తనిఖీలతో అప్రమత్తమైన పలువురు తమ దుకాణాలకు తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
వ్యక్తి దుర్మరణం
గోరంట్ల (సోమందేపల్లి): వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గోరంట్ల మండలం గుంతపల్లికి చెందిన నరసింహారెడ్డి గురువారం సొంత పనిపై గోరంట్లకు వెళ్లాడు. పని ముగించుకున్న అనంతరం రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన గుంతపల్లి సమీపంలోకి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనం నిలపకుండా దూసుకెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న గోరంట్ల పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.