
సాగు కృష్ణార్పణం
265
ఎంబీసీ పరిధిలోని చెరువుల సంఖ్య
మడకశిర: జిల్లాలోని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ (హంద్రీనీవా సుజల స్రవంతి) మడకశిర బ్రాంచ్ కెనాల్ పరిధిలోని రైతులకు కృష్ణా జలాలు అందక గగ్గోలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పూర్తి స్థాయిలో కృష్ణా జలాలను అందించకపోవడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. మడకశిర బ్రాంచ్ కెనాల్ పరిధిలో పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో 265 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నీ కృష్ణా జలాలతో నింపి సాగునీరు అందించాల్సిన కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని రైతులు మండిపడుతున్నారు.
తూతూ మంత్రంగా కృష్ణా జలాలు..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. మడకశిర నియోజకవర్గంలో మొత్తం 165 చెరువులున్నాయి. అందులో కేవలం 23 చెరువులకు మాత్రమే కృష్ణా జలాలను విడుదల చేశారు. పెనుకొండ నియోజకవర్గంలో 19 చెరువులకు, హిందూపురం నియోజకవర్గంలో 4 చెరువులకు మాత్రమే కూటమి ప్రభుత్వం కృష్ణా జలాలను విడుదల చేసింది. మూడు నియోజకవర్గాల్లోని 219 చెరువులకు కృష్ణా జలాలు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
గతమెంతో ఘనం..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మడకశిరకు క్రమంప్పకుండా కృష్ణా జలాలు వచ్చాయి. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మడకశిర మండలంలో కృష్ణా జలాలు పారాయి. ఆ తర్వాత వరుసగా రెండేళ్ల పాటు మడకశిరకు కృష్ణా జలాలు రావడం విశేషం. అలాగే మడకశిర చెరువును రెండుసార్లు నింపిన ఘనత కూడా వైఎస్ జగన్‌కే దక్కుతుంది. అయితే కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చింది. మొదటి ఏడాది కూడా కృష్ణా జలాలు రాలేదు. ప్రస్తుత ఏడాది కూడా కృష్ణా జలాలను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది.
అటకెక్కిన బైపాస్ కెనాల్..
మడకశిర నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కృష్ణా జలాలను అందించడానికి వీలుగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మడకశిర బైపాస్ కెనాల్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఇందుకు కోసం రూ.214.85 కోట్ల నిధులను కూడా మంజూరు చేసి టెండర్లను కూడా పూర్తి చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ కెనాల్ పనులను చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తోంది. బైపాస్ కెనాల్‌ను అటకెక్కించారని రైతులు మండిపడుతున్నారు.
హడావుడికే పరిమితమైన నేతలు..
మడకశిర నియోజకవర్గానికి కృష్ణా జలాలు వచ్చేశాయంటూ ప్రారంభంలో కూటమి నేతలు హడావుడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఒక అడుగు ముందుకేసి కూటమి నేతలను వెంటేసుకుని హంద్రీనీవా కాలువలను పరిశీలించారు. మంత్రి సవిత, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కృష్ణా జలాలతో చెరువులను సస్యశ్యామలం చేస్తామని గొప్పలు చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా కృష్ణా జలాలు రాకపోవడంతో రైతులు కూటమి నేతల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చెరువులన్నీ నింపేందుకు అవసరమైన నీరు
5టీఎంసీలు
కృష్ణా జలాలు అందని
చెరువులు
మడకశిర నియోజకవర్గంలో
కృష్ణా జలాలు అందని
చెరువులు
ఎంబీసీ పరిధిలోని 265 చెరువులకు
కృష్ణాజలాలు విడుదల చేస్తామని
మంత్రి సవిత, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గొప్పలు
కంటితుడుపుగా కేవలం
46 చెరువులకే నీళ్లు
సాగునీరు లేక అందక రైతుల గగ్గోలు
వైఎస్ జగన్ హయాంలో వరుసగా మూడేళ్లు కృష్ణా జలాలు
219
142
ఇది అగళి మండలంలోని కోడిపల్లి చెరువు. వర్షాకాలంలోనూ నీరులేక ఇలా వెలవెలబోతోంది. ఈ చెరువుపై ఆధారపడి దాదాపు 180 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. దాదాపు 200 ఎకరాల ఆయకట్టు ఉంది. సరైన వర్షాలు రాకపోవడంతో ఈచెరువులోకి ఇంత వరకు నీరు చేరలేదు. దీంతో రైతులు కృష్ణాజలాలపై ఆశలు పెట్టుకున్నారు. ఈ చెరువుకే గాక అగళి మండలంలోని మిగిలిన చెరువులకు కూడా కృష్ణా జలాలు రావాలంటే హంద్రీనీవా అగళి మైనర్ కాలువను పూర్తి చేయాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఇంత వరకు కాలువను పూర్తి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇది అగళి మండలంలోని హంద్రీనీవా మైనర్ కాలువ. ప్రస్తుతం ఈ కాలువ నిరుపయోగంగా మారింది. కృష్ణా జలాలు పారక పోవడంతో కంపచెట్లు విపరీతంగా పెరిగాయి. అమరాపురం, అగళి మైనర్ కాలువ పనులను పూర్తి చేయడానికి వైఎస్ జగన్ హయాంలో రూ.69.90 కోట్ల నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. అంతలోనే ప్రభుత్వం మారడంతో ఈ కాలువల పనులకు నిధులు విడుదల ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం పనులను చేపట్టకపోవడం రైతులకు శాపంగా మారింది. పంటలు సాగుకు నీళ్లు లేకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.

సాగు కృష్ణార్పణం

సాగు కృష్ణార్పణం