
హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పనులు వేగవంతం చేయండి
ప్రశాంతి నిలయం: హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) పథకం పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాలులో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పనులపై సమీక్షించారు. జిల్లా పరిధిలోని పనులను మూడు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని, అధికారులు పనులు నిత్యం పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలన్నారు. టన్నెల్ మట్టి పనులు నెలాఖరులోగా పూర్తి చేస్తామని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. లైనింగ్, టన్నెల్‌తో పాటు బెడ్ వర్క్ పనులన్నీ ఆగస్టు 20వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఈఈ రాజా స్వరూప్‌కుమార్, ఈఈలు మురళి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు శెట్టి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ భూసేకరణ విభాగం అధికారి ఇంతియాజ్, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, ఇందులో నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీ–4, పీజీఆర్‌ఎస్, వసతి గృహాల తనిఖీ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పీ–4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాల పునఃపరిశీలనకు నిర్వహించే గ్రామ సభల గురించి ఆయా గ్రామాల్లో ముందుగానే ప్రచారం చేసి ప్రజలంతా పాల్గొనేలా చూడాలన్నారు. ‘స్వర్ణాంధ్ర విజన్’లో భాగంగా అధికారులంతా ఆయా మండలాల పరిధిలోని వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల్లో నీరు, భోజన వసతిపై నివేదిక పంపాలన్నారు.
స్వచ్ఛ ఓటరు జాబితాకు సహకరించండి
తప్పుల్లేని స్వచ్ఛ ఓటరు జాబితాకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ కోరారు. శుక్రవారం ఆయన డీఆర్‌ఓ విజయసారథితో కలసి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో ఉన్న మృతులు, శాశ్వతంగా వలసవెళ్లిన వారు, డబుల్ ఎంట్రీల తొలగింపునకు సహకరించాలని కోరారు. అలాగే మార్పులు, చేర్పుల కోసం 1,576 మంది బూత్ స్థాయి అధికారులను నియమించామన్నారు. వీరిని సమన్వయం చేసుకుని మార్పులు, చేర్పులుంటే చేసుకోవాలని సూచించారు. 1 జనవరి 2026 నాటికి 18 ఏళ్లు నిండిన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. సమావేశంలో రవినాయక్ (వైఎస్సార్ సీపీ), సతీష్‌కుమార్ (బీజేపీ), సామకోటి ఆదినారాయణ (టీడీపీ) తదితరులు పాల్గొన్నారు.