
‘తమ్ముడి’ దౌర్జన్యం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు గ్రామాల్లో అమాయకుల భూములతో పాటు ప్రభుత్వ భూములు, పంచాయతీ స్థలాలను కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అండతో ‘తెలుగు తమ్ముళ్లు’ గ్రామ స్థాయి నుంచి అరాచకాలకు తెగబడుతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. గ్రామస్తులు తిరగబడితే.. కేసులు పెట్టిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో టీడీపీ నేతల అవినీతి, అక్రమాలను ప్రజలు మౌనంగానే భరిస్తున్నారు.
పశువుల కోసం కేటాయించిన స్థలం కబ్జా..
కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్ల క్రితం పశువుల తాగునీటి కోసమని కొంత స్థలాన్ని పంచాయతీ కేటాయించి, నీటి తొట్టెను ఏర్పాటు చేసింది. ఆ స్థలంపై కన్నేసిన స్థానిక టీడీపీ నేత నరసింహులు... తొట్టెను ధ్వంసం చేసి బాత్‌రూమ్‌ను నిర్మించాడు. ఆరంభంలోనే గుర్తించిన గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ఎంపీడీఓ గ్రామ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ సమస్య వివరించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టరేట్‌లో ప్రజా సమస్య పరిష్కార వేదికలోనూ ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ స్పందించలేదు. ఈ మూడు నెలల వ్యవధిలోనే తొట్టె మాయమై బాత్‌రూమ్ వెలసింది.
అడ్డుకునే వారు కరువు..
అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నా అడిగే వారు ఎవరూ లేకుండా పోయారు. అడ్డుకోవాల్సిన అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. గ్రామస్తులు ఎవరయినా అభ్యంతరం వ్యక్తం చేస్తే.. అధికారంలో ఉన్నామని.. కేసుల్లో ఇరికించి జైలు పాలు చేస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు, మూడు సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించారని గ్రామానికి చెందిన కొందరు వాపోయారు. తాగునీటి తొట్టె సంగతిని ఎవరూ పట్టించుకోకపోతే భవిష్యత్తులో గ్రామంలోని మిగులు పంచాయతీ స్థలాలను కబ్జా చేసే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరంభంలోనే ఇలాంటి దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గుంతపల్లిలో పశువుల స్థలం కబ్జా
నీటి తొట్టెను ధ్వంసం చేసి
బాత్‌రూం నిర్మాణం
గ్రామస్తులు ఫిర్యాదు చేసినా
పట్టించుకోని అధికారులు