
నేడు జిల్లాకు భారీ వర్ష సూచన
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాకు శనివారం భారీ వర్ష సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదు కావచ్చన్నారు. తర్వాత నాలుగు రోజులు కూడా వర్ష సూచన ఉందని తెలిపారు. 20న 14 మి.మీ, 21న 10 మి.మీ, 22న 15 మి.మీ, 23న 12 మి.మీ. చొప్పున వర్షం కురిసే సూచన ఉన్నట్లు వెల్లడించారు.
సునీతమ్మా..
నోరు అదుపులో పెట్టుకో
● దద్దమ్మ ఎవరో ప్రజలందరికీ తెలుసు
● వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్ రెడ్డి
సాక్షి, పుట్టపర్తి: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నోరు అదుపులో పెట్టుకోవాలని.. దద్దమ్మలు ఎవరో ప్రజలందరికీ తెలుసునని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే రామగిరి ఎంపీపీ ఎన్నికను వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు బహిష్కరించారన్నారు. ఈ ఏడాది మార్చిలో ఎంపీపీ ఎన్నికకు వస్తుండగా.. టీడీపీ కార్యకర్తలు విధ్వంసాలకు పాల్పడుతున్నా.. పోలీసులు చేష్టలుడిగి చూశారన్నారు. గతంలో (2017) కనగానపల్లిలో వైఎస్సార్ సీపీకి మెజార్టీ ఉన్నప్పటికీ.. పరిటాల సునీత మంత్రి హోదాలో సమావేశానికి హాజరై వైఎస్సార్ సీపీ సభ్యులతో బలవంతంగా చేతులు ఎత్తించి సరిపూటి గీతను ఎంపీపీ చేసిన సంగతిని గుర్తు చేశారు. బలం లేకున్నా.. అధికార దాహంతో దౌర్జన్యాలకు పాల్పడుతూ.. బెదిరింపులకు దిగుతూ ఎన్నికల కోసం తహతహలాడుతున్నదెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. కూటమి సర్కారు తీరు.. పోలీసుల వైఖరికి నిరసనగానే ఎన్నికలు బహిష్కరించినట్లు వివరించారు. జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో ఎన్నికలు నిర్వహిస్తే.. హాజరై ఎంపీపీ సీటు కై వసం చేసుకుంటామన్నారు.
ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు
గుడిబండ: పొలం నుంచి ఇంటికి వస్తున్న ఓ రైతుపై ఎలుగుబంటి దాడి చేయగా... రైతు తీవ్రంగా గాయ పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం గుడిబండ మండల పరిధిలోని ఎస్.రాయాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన భూతరాజు తన పొలంలో వేరుశనగ సాగు చేశాడు. అడవి జంతువుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు గురువారం రాత్రి పొలానికి కాపలా వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఇంటికి వస్తుండగా..మార్గమధ్యంలో హఠాత్తుగా ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భూతరాజును కుటుంబ సభ్యులు గుడిబండ పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
430 బస్తాల
రేషన్ బియ్యం స్వాధీనం
మడకశిర: విజిలెన్స్ అధికారులు శుక్రవారం మడకశిరలోని పలు దుకాణాల్లో దాడులు చేశారు. ఈ సమయంలోనే అటుగా వెళ్తున్న లారీని తనిఖీ చేయగా... 430 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. దీంతో లారీతో పాటు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ సీఐ జమాల్‌బాషా తెలిపారు.

నేడు జిల్లాకు భారీ వర్ష సూచన

నేడు జిల్లాకు భారీ వర్ష సూచన

నేడు జిల్లాకు భారీ వర్ష సూచన