తాగునీరు కరువు.. నడిచేందుకు రోడ్డు లేదు | - | Sakshi
Sakshi News home page

తాగునీరు కరువు.. నడిచేందుకు రోడ్డు లేదు

Jul 19 2025 4:00 AM | Updated on Jul 19 2025 4:00 AM

తాగునీరు కరువు.. నడిచేందుకు రోడ్డు లేదు

తాగునీరు కరువు.. నడిచేందుకు రోడ్డు లేదు

పుట్టపర్తి టౌన్‌: ‘‘వార్డుల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతున్నాం. వీధిలైట్లు, తాగునీరు, రోడ్లు అన్నీ సమస్యే. ప్రజలు నిలదీస్తే ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. ఈ సమస్యలపై పలుమార్లు కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చినా ఉపయోగం లేదు. సమస్యలు పరిష్కరించనప్పుడు సమావేశాలు ఎందుకు నిర్వహించాలి. టీ తాగి... స్నాక్స్‌ తిని వెళ్లేందుకా’’ అంటూ టీడీపీ కౌన్సిలర్లే ఏడాది కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశం మందిరంలో చైర్మన్‌ తుంగా ఓబుళపతి ఆధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, కమిషనర్‌ క్రాంతికుమార్‌, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లు నాగమణి (12వ వార్డు), రమణమ్మ (10వ వార్డు) మాట్లాడుతూ..పుట్టపర్తి అభివృద్ధి గురించి ప్రశ్నల వర్షం కురిపించారు. టీడీపీ అధికారంలోకి ఉన్నా..తాము అధికార పార్టీ కౌన్సిలర్లమే అయినా వార్డుల్లో ప్రజల కనీస అవసరాలు తీర్చలేని దుస్థితిలో ఉన్నామని వాపోయారు. రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయని, పారిశుధ్యంలోపించడంతో వీధుల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉందని కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ కౌన్సిలర్లే ఎదురుదాడి చేయడంతో వేదికపై ఉన్న ఎమ్మెల్యే సింధూరారెడ్డి, కమిషనర్‌ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అనంతరం తేరుకున్న ఎమ్మెల్యే... సమష్టి కృషితో పుట్టపర్తిని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలకు దేశవిదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అభివృద్ధి కార్యక్రమాలతో పుట్టపర్తికి నూతన శోభ తీసుకురావాలన్నారు. వీధిలైట్లు, తాగునీరు, రహదారులు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

పన్నులు వసూలు చేస్తేనే అభివృద్ధి..

ప్రజల నుంచి పన్నులు వసూలు చేయకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అధికారులను ప్రశ్నించారు. అవసరమైతే పాలకసభ్యుల సహకారం తీసుకుని ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలన్నారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతికుమార్‌ మాట్లాడుతూ... ఆస్తి, నీటి... ఇతర పన్నులు దాదాపు రూ.12 కోట్ల మేర బకాయిలు ఉన్నాయన్నారు. పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారించామని, కౌన్సిలర్లు కూడా చొరవ తీసుకుంటే వసూళ్లు పెరుగుతాయన్నారు. పట్టణాభివృద్ధికి దాతలు కూడా ముందుకు రావాలని కోరారు. అనంతరం అజెండాలోని అంశాలపై చర్చ జరపకుండానే వాటికి ఆమోదం తెలిపారు. సమావేశంలో వైస్‌ చైర్మన్లు శ్రీలక్ష్మి, తిప్పన్నతోపాటు మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రొటోకాల్‌ కూడా పాటించరా?

5వ వార్డు కౌన్సిలర్‌ సూర్యాగౌడ్‌ మాట్లాడుతూ... అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో కనీసం ఆ వార్డు కౌన్సిలర్‌కు కూడా సమాచారం ఇవ్వడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ పాటించకుండా భూమి పూజ ఎలా చేస్తారని నిలదీశారు. ఇంజినీరింగ్‌ కార్మికులు సమ్మెలోకి వెళ్తున్నామని నాలుగురోజుల కిందటే నోటీసులిచ్చినా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 వార్డు కౌన్సిలర్‌ చెరువు భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ... వార్డుల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు మూలన పడిన కాంప్యాక్టర్లు, ఎలక్ట్రికల్‌ బ్యాటరీలు మరమ్మతులు చేయించాలన్నారు. రోడ్లు అధ్వానంగా మారాయని, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని కోరారు.

ఏడాదిలో మనం చేసిన

అభివృద్ధి ఇదేనా..?

జనం ప్రశ్నిస్తుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు

పుట్టపర్తి మున్సిపల్‌ కౌన్సిల్‌

సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ల

ఆవేదన

ప్రజల నుంచి పన్ను వసూళ్లకు

గట్టి చర్యలు తీసుకోవాలని

ఎమ్మెల్యే ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement