
నా జోలికొస్తే అంతు చూస్తా
చిలమత్తూరు: తన అవినీతి అక్రమాలను బయటపెడుతున్న సాక్షి విలేకరిపై ఓ టీడీపీ నేత రెచ్చిపోయాడు. ‘నా జోలికొస్తే ఊరుకోను... నీ అంతు చూస్తా జాగ్రత్త’ అంటూ బెదిరింపులకు దిగాడు. హిందూపురం నియోజకవర్గంలో ఏడాది కాలం పరిస్థితులపై ఈనెల 13న ‘‘హిందూపురం.. అభివృద్ధి శూన్యం’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ కథనంలోనే చిలమత్తూరులో జరిగిన నాసిరకం రహదారి పనులు... ఆ పనుల పరస్థితిని తెలిపే చిత్రాలను సైతం ప్రచురించింది. దీంతో సదరు రహదారి పనులు చేసిన టీడీపీ నేత నాగరాజు యాదవ్ సాక్షి విలేకరిపై కక్షగట్టాడు. మంగళవారం విలేకరి శ్రీధర్‌రెడ్డికి ఫోన్ చేసి దుర్బాషలాడాడు. తనను గెలుక్కుంటే అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. వాస్తవాలు రాస్తే చంపేస్తారా..అని ప్రశ్నిస్తే... నువ్వు అలాంటి రాతలు రాస్తే అదే జరుగుతుందంటూ భయపెట్టాడు.
నాగరాజు యాదవ్‌పై చర్యలు తీసుకోండి
సాక్షి విలేకరిపై టీడీపీ నేత నాగరాజు యాదవ్ గూండాగిరీని చిలమత్తూరు పాత్రికేయ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. నేతల అరాచకాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగుతారా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమన్నారు. సదరు టీడీపీ నేత నాగరాజు యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని ఎస్‌ఐ మునీర్ అహ్మద్‌ను జర్నలిస్టులు కోరారు.
దాడులు, బెదిరింపులు సరికాదు
రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి విలేకరులపై, పత్రికా కార్యాలయాలపై కూటమి నేతలు చేస్తున్న దాడులు ప్రజాస్వామ్యానికి హాని కలిగించేలా ఉన్నాయని జర్నలిస్టు నేతలు ఆంజనేయులు, నరసింహారెడ్డి మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్ట్‌లపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి నియంతృత్వ పాలన మునుపెన్నడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు ప్రత్యేకమైన స్థానం ఉందని, అలాంటి కలంపై దౌర్జన్యాలు సహించబోమన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు ఆంజనేయులు, శంకర్, సురేష్‌రెడ్డి, పవన్, నరసింహారెడ్డి, విశ్వనాథ్, వనం శ్రీనివాసరెడ్డి, నారాయణస్వామి, నాగార్జున, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘సాక్షి’ విలేకరికి టీడీపీ నేత బెదిరింపులు
చిలమత్తూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు