
కేంద్ర బృందం పర్యటన
మడకశిర రూరల్: మండలంలోని మెళవాయి పంచాయతీలోని గ్రామాల్లో బుధవారం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025 కేంద్ర బృందం సభ్యులు రామాంజనేయులు, శ్రీనివాసులు పర్యటించారు. యూ.రంగాపురం, మెళవాయి, జక్కేపల్లి గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, భోజన పథకం, అంగన్‌వాడీ సేవల అమలు తదితర వాటిని పరిశీలించారు. గ్రామాల్లో పారిశుధ్యం పరిస్థితి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్వహణ, తడి.. పొడి చెత్త సేకరణ, చెత్త నుంచి సంపద తయారీ తదితర అంశాలపై ఆరా తీశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రంగనాథ్, ఈఓఆర్డీ నాగరాజు నాయక్, కార్యదర్శి అశ్వత్థరెడ్డి, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కొండకు తరలిన
ఓబుళ లక్ష్మీనృసింహుడు
చెన్నేకొత్తపల్లి: మండల కేంద్రంలో కొలువైన ఓబుళ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 6న గ్రామ సమీపంలోని కొండపై ఉన్న ఆలయం నుంచి తీసుకువచ్చిన ఉత్సవమూర్తులను బుధవారం తిరిగి కొండపైకి చేర్చారు. ఈ 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ఉత్సవ మూర్తులను నూతన వస్త్రంలో ఉంచి పూజలు చేసిన అనంతరం ఊరేగింపుగా కొండకు తరలించారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది.
రేషన్ బియ్యం స్వాధీనం
పెనుకొండ రూరల్: అనంతపురం నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బుధవారం మధ్యాహ్నం పెనుకొండ మండలం అమ్మవారిపల్లి వద్ద కియా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనంలో 60 సంచుల్లో (ఒక్కో సంచిలో 50 కిలోలు) ఉన్న రేషన్ బియ్యాన్ని గుర్తించి, వాహనాన్ని సీజ్ చేశారు. డ్రైవర్ ముత్యాలుతో పాటు బియ్యం వ్యాపారి సోమును అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీఎస్‌డీటీ ప్రభావతికి అప్పగించారు.

కేంద్ర బృందం పర్యటన