
బ్లాస్టింగ్‌తో భయాందోళన
● పోలీసులకు ఫిర్యాదు చేసిన రెండు గ్రామాల ప్రజలు
నల్లమాడ: గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా చెరువువాండ్లపల్లి, సి.కొత్తపల్లి గ్రామాలకు సమీపంలో కాంట్రాక్టర్లు చేపట్టిన బ్లాస్టింగ్‌లతో ఆయా గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భయంకరమైన శబ్దాలతో పాటు రాళ్లు ఎగిసిపడి పంట పొలాలు, గ్రామంల్లోని ఇళ్లపై వచ్చి పడుతున్నట్లు పలువురు వాపోయారు. భారీ శబ్ధాలకు భవనాలు కంపిస్తున్నాయన్నారు. టీవీలు పేలిపోతున్నాయని గ్రామాలకు చెందిన రామచంద్ర, రమేష్‌రెడ్డి, ఎం.కృష్ణారెడ్డి, వేణుగోపాలరెడ్డి, శ్రీనివాసులు, గంగరాజు, వనజ, సుజాత, రాధమ్మ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, రాళ్లు మీదపడి ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఓపెన్ బ్లాస్టింగ్ జరపకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 14న స్థానిక పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
పెనుకొండ రూరల్: పట్టణంలోని పలు ఎరువుల దుకాణాను విజిలెన్స్ అధికారులు శివకుమార్, శివన్న, ప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలకు సంబంధించిన రికార్డులు, నిల్వలు పరిశీలించారు. ఎస్‌ఎల్‌వీ, మన ఆగ్రో దుకాణాల్లో రికార్డులు సరిగాలేని 46 క్వింటాళ్ల విత్తనాలను గుర్తించారు. రూ.13.27 లక్షల విలువైన సరుకు విక్రయాలను నిలుపుదల చేస్తూ నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా వారి వెంట స్థానిక ఏఓ చందన ఉన్నారు.
వృద్ధురాలిపై దాడి
● ఆలస్యంగా వెలుగులోకి ఘటన
గాండ్లపెంట: మండలంలోని మలమీదపల్లి పంచాయతీ బనాన్‌చెరువుపల్లికి చెందిన 78 ఏళ్ల వయసున్న ఎం.సరస్వతిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఆమె తలపై లోతైనా గాయాలయ్యాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి వివరాలు.. ఈ నెల 12న ఉదయం 10.30 గంటలకు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. గుర్తించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి చేర్చి, విషయాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నివాసముంటున్న కుమారుడు సుబ్బారెడ్డికి తెలిపారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో సమాచారాన్ని బావ నరసింహరెడ్డికి చేరవేశాడు. అప్పటికే నల్లచెరువు మండలం పాలపటిదిన్నె ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చిన ఆయన వెంటనే బనాన్‌చెరువుపల్లికి చేరుకుని పరిశీలించాడు. బాత్రూమ్‌లో పడి గాయపడి ఉంటుందని భావించి కదిరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వృద్ధురాలి తలపై లోతైన గాయాలను గుర్తించిన వైద్యులు అవి బలంగా కొట్టడం వల్ల అయిన గాయాలుగా నిర్ధారించారు. దీంతో ఆగమేఘాలపై అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బుధవారం ఉదయం నరసింహారెడ్డి బనాన్‌చెరువు పల్లికి చేరుకుని ఇంటిని క్షుణ్ణంగా పరిశీలంచాడు. ఇంటి వద్ద రక్తపు మరకలైన కట్టెతో పాటు గుర్తు తెలియని వ్యక్తుల చెప్పులు, టవాలు పడి ఉండడం గుర్తించి ఫిర్యాదు చేయడంతో ఎన్‌పీకుంట ఎస్‌ఐ వలీబాషా, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. నరసింహారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.