
ఉల్లాసంగా ఉట్ల పరుష
బత్తలపల్లి/ధర్మవరం రూరల్: మండలంలోని అప్పరాచెరువు గ్రామంలో మొహర్రం ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఉట్ల పరషను ఉత్సాహంగా సాగింది. పీర్ల చావిడి ఎదుట ఏర్పాటు చేసిన 40 అడుగుల ఎత్తైన ఉట్లమానును ఎక్కేందుకు సాయంత్రం 5 గంటలకు గ్రామంలోని వాల్మీకి (బోయ) సామాజిక వర్గానికి చెందిన 20 మంది యువకులు పోటీ పడ్డారు. వేడుకను చూసేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో అప్పరాచెరువు జనసంద్రమైంది. చివరికి రవితేజా అనే యువకుడు ఉట్లమాను పైకి ఎక్కడంతో ప్రజలు చప్పట్లు కొట్టి అభినందించారు. అంతకు ముందు మరగాళ్లు, కోలాటం, కీలుగుర్రాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అలాగే ధర్మవరం మండలం చిగిచెర్లలోనూ బుధవారం ఉత్సాహంగా ఉట్ట పరుషను గ్రామస్తులు నిర్వహించారు. అంతకు ముందు పీర్ల మకాన్‌లో ఉన్న మౌలాలీ స్వామికి చక్కెర చదివింపులు చేసి గజమాలలతో అలంకరించారు.