
పన్ను వసూలులో నిర్లక్ష్యం వద్దు : డీపీఓ
పరిగి: గ్రామ పంచాయతీల పరిధిలో నీటి, ఇంటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వీడాలని పంచాయతీ కార్యదర్శులను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) సమత ఆదేశించారు. బుధవారం ఆమె పరిగి మండలంలో పర్యటించారు. తొలుత పి.నరసాపురం గ్రామానికి చేరుకున్న ఆమె డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించారు. కాలువలు అధ్వానంగా ఉన్నాయని, వెంటనే పారిశుధ్య పనులు చేపట్టాలని కార్యదర్శి తిప్పన్నను ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు పక్కన చెత్త వేయకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. నీటి నిల్వ ప్రదేశాలను బ్లీచింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రెడ్డప్ప, వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.
నేత్రదానం
ధర్మవరం అర్బన్: మరణానంతరం తన నేత్ర దానంతో ఇద్దరికి కంటిచూపును అందించారు ధర్మవరం మండలం గొట్లూరుకు చెందిన బండ్ల నారాయణ(80). బుధవారం ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకుడు కోళ్లమొరం చంద్రశేఖరరెడ్డి వెంటనే బాధిత కుటుంబసభ్యులను కలసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. దీంతో మృతుని నేత్రాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని కుమారుడు బండ్ల మంజునాథ్, కోడలు శ్రీవనిత, కుమార్తె భాగ్యలక్ష్మి, తమ్ముడు బండ్ల రామాంజనేయులుకు విశ్వదీప సేవా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సురేష్, ఉపాధ్యక్షుడు టి.చంద్రశేఖర్‌రెడ్డి, సభ్యులు ఖమ్మం మాధవ, జుజారు రఘు, ప్రభాకర్‌రెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం యాదవ వీధిలో..
● ధర్మవరం: స్థానిక యాదవవీధికి చెందిన వేల్పుమడుగు ఆంజనేయులు(62) బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యువర్స్ ఫౌండేషన్ సభ్యులు వైకే శ్రీనివాసులు, డాక్టర్ బీవీ సుబ్బారావు, కౌన్సిలర్ కేతా లోకేష్.. మృతుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. దీంతో మృతుని నేత్రాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర, ఆప్తమాలిక్ ఆఫీసర్ షేక్ సికిందర్ సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని సోదరులు రాము, ప్రసాద్‌కు యువర్స్ ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆలయంలో చోరీ
తనకల్లు: మండల పరిధిలోని పెద్దపల్లిలో వెలసిన గంగమ్మ ఆలయంలో బుధవారం చోరీ జరిగింది. ఆలయ తాళాలను తొలగించి లోపలకు ప్రవేశించిన దుండగులు హుండీని పగులగొట్టి అందులోని నగదుతో పాటు గర్భగుడిలోని ఇతర సామగ్రిని అపహరించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
గుడిబండ: మండలంలోని బాలేపట్టికి చెందిన మంజునాథ్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. బాలేపల్లి ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రామలింగప్పకు ముగ్గురు సంతానం కాగా, మంజునాథ్ రెండో కుమారుడు. ఇంకా వివాహం కాలేదు. తరచూ కడుపు నొప్పితో బాధపడేవాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నొప్పి తీవ్రత తట్టుకోలేక స్టోర్ రూమ్‌లోకి వెళ్లి దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజ్‌కుళ్లాయప్ప తెలిపారు.
పాము కాటుతో
మహిళా రైతు మృతి
ముదిగుబ్బ: మండలంలోని సిద్దన్నగారిపల్లికి చెందిన మహిళా రైతు సువర్ణ (44) పాముకాటుతో మృతి చెందారు. తన భర్త శివారెడ్డితో కలసి బుధవారం వ్యవసాయ తోటలో పని చేస్తుండగా చేతిపై పాము కాటు వేసింది. వెంటనే బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

పన్ను వసూలులో నిర్లక్ష్యం వద్దు : డీపీఓ

పన్ను వసూలులో నిర్లక్ష్యం వద్దు : డీపీఓ

పన్ను వసూలులో నిర్లక్ష్యం వద్దు : డీపీఓ

పన్ను వసూలులో నిర్లక్ష్యం వద్దు : డీపీఓ