
తమ్ముడూ.. అమ్మను బాగా చూసుకో
గుత్తి రూరల్: ‘తమ్ముడూ.. అమ్మను బాగా చూసుకో’ అంటూ ఓ యువకుడు వీడియో కాల్‌లో తన సోదరుడికి సూచించి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు.. గుత్తి మండలం టి.కొత్తపల్లికి చెందిన సూర్యనారాయణ, శారదమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు నంద్యాల రేవంత్ కుమార్ (28) ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటూ తమకున్న 8 ఎకరాల్లో తమ్ముడు కిరణ్ కుమార్‌తో కలసి పంటలు సాగుతో పాటు బొలెరో వాహనం నడుపుతూ జీవనం సాగించేవాడు. పంటల సాగుతో పాటు బొలెరో వాహనం కొనుగోలుకు అప్పులు చేశాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు పండక నష్టపోయాడు. అలాగే బొలెరో వాహనానికి సరైన బాడుగలు లేకపోవడంతో నెలవారీ కంతులు కట్టుకోలేక రూ.16లక్షల వరకూ అప్పుల పాలయ్యాడు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ తరచూ మదనపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గుత్తి నుంచి మిరపకాయల లోడు తీసుకుని హైదరాబాద్‌కు బయలుదేరిన రేవంత్‌కుమార్... తెలంగాణలోని వనపర్తి జిల్లా పెబ్బేరు వద్దకు చేరుకోగానే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి తమ్ముడికి వీడియో కాల్ చేశాడు. ‘ఇక నేను మీకు భారం కాను... అమ్మను బాగా చూసుకో’ అని చెప్పి పురుగుల మందు తాగాడు. గమనించిన బొలెరో వాహన క్లీనర్ వెంటనే అప్రమత్తమై వనపర్తి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రేవంత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు.
తెలంగాణలో గుత్తి మండలానికి చెందిన యువకుడి ఆత్మహత్య