
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పాలన మొదలుపెట్టి ఏడాది తిరక్కుండానే టీడీపీ ఎమ్మెల్యేల్లో సర్వేల గుబులు మొదలైంది. సంవత్సరంలోనే నాలుగేళ్ల వ్యతిరేకతను మూటగట్టుకున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఓ వైపు ముఖ్యమంత్రే స్వయానా ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ద్వారా సర్వే చేయిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫున వ్యూహకర్త రాబిన్ శర్మ సర్వే చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ రెండింట్లోనూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఇద్దరు మంత్రులతో సహా 8 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు వెల్లడైనట్లు తెలిసింది. మరికొన్ని నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం తీవ్రంగా పడనుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు ఉమ్మడి జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
మెజారిటీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులే గెలిచారు. కూటమి పాలన మొదలెట్టి ఈ ఏడాది జూన్ 12 నాటికి ఏడాది దాటింది. తాజా సర్వేల ప్రకారం 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులపై వ్యతిరేకత పెల్లుబికుతోందని చర్చ జరుగుతోంది.
ఐవీఆర్‌ఎస్ ద్వారా జరిగిన సర్వేలో 60 శాతం మందికి పైగా ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇద్దరు మంత్రులపైనా నిప్పులు చెరిగినట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి స్వల్పకాలమే అయినా ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.
వ్యతిరేకతకు ప్రధాన కారణాలివే..
అన్ని నియోజకవర్గాల్లో ఉచిత ఇసుక అని చెప్పి.. ఎమ్మెల్యేలే అక్రమంగా తరలిస్తూ సామాన్యులకు అందకుండా చేస్తున్నారు.
పలు నియోజవర్గాల్లో మట్టిని అక్రమంగా తోలుతూ సామాన్యులతో మాత్రం వేలకు వేలు వసూలు చేస్తున్నారు.
సామాన్యులకు సంబంధించిన ఖాళీ స్థలాలు కనిపిస్తే ఎమ్మెల్యేల అనుచరులం అని చెప్పి పాగా వేసి కంచె వేస్తున్నారు. అధికారులకు చెప్పుకుంటున్నా పరిష్కారం లేదు.
మద్యం సిండికేటు అయి పర్మిట్‌రూములు, బెల్టుషాపుల ద్వారా పల్లెల్లో విచ్చలవిడిగా మద్యం అమ్ముతుండటం వల్ల మహిళలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.
చాలామంది ఉద్యోగులు బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో సిఫార్సు లేఖలకు భారీగా వసూలు చేయడంతో ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత వచ్చింది.
అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపడితే మున్సిపాలిటీ అధికారులను పంపించి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు.