
15 నుంచి గ్రామ సభలు నిర్వహించాలి
ప్రశాంతి నిలయం: పీ–4 సర్వేలో ఎంపికై న బంగారు కుటుంబాలను మరోసారి పరిశీలించేందుకు ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకూ గ్రామసభలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పీ–4 కార్యక్రమంపై అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ సభల్లో ఇప్పటికే ఎంపికై న బంగారు కుటుంబాలను పరిశీలించి అర్హులైన వారిని తుది జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులను జాబితా నుంచి తొలగించాలన్నారు. బంగారు కుటుంబాల తుది జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. సమావేశంలో విజయవాడ నుంచి వచ్చిన అబ్జర్వర్ తమ్మిశెట్టి సాయి సాత్విక్, సీపీఓ విజయ్ కుమార్, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హల్కూరుకు అరుదైన అవకాశం
● ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద ఎంపిక
ప్రశాంతి నిలయం: షెడ్యూల్డ్ కులాల వారు ఎక్కువగా ఉన్న గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజనకు అమరాపురం మండలంలోని హల్కూరు గ్రామం ఎంపికైందని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో హల్కూరు గ్రామ అభివృద్ధి ప్రణాళిక అమోదం జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ... ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద ఎంపికై న హల్కూరుకు కేంద్రం రూ.20 లక్షలు మంజూరు చేస్తుందన్నారు. వీటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేసి ఇంతకు ఐదురెట్లు పనులు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతుందన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అంగన్‌వాడీ భవన నిర్మాణం, ఆర్వో వాటర్ ప్లాంట్, ఎస్సీ కాలనీలో కరెంట్ స్తంభాల ఏర్పాటు, ఎస్‌హెచ్‌జీ రిసోర్స్ సెంటర్ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, జిల్లా కన్వీనర్ శివరంగ ప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, ఎల్డీఎం రమణకుమార్, డీఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ నేతల బాహాబాహీ
● సహకార సంఘం
అధ్యక్ష పదవి కోసం రగడ
● పార్టీ కార్యాలయంలోనే సవిత,
బీకే వర్గాల ముష్టి యుద్ధం
గోరంట్ల: టీడీపీ నేతలు ముష్టి యుద్ధానికి దిగారు. గౌనివారిపల్లి సహకార సంఘం అధ్యక్ష పదవి కోసం రెండు వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యాలయంలోనే బాహాబాహీకి దిగారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది.
ఏం జరిగిందంటే...
గౌనివారిపల్లి సహకార సంఘం అధ్యక్ష పదవి కోసం హిందూపురం ఎంపీ పార్థసారథి, బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత వర్గాల మధ్య పోటీ నెలకొంది. ఎవరికి వారు తమకే పదవి కావాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో సోమవారం పార్టీ కన్వీనర్ బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో సహకార సంఘం అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడానికి పార్టీ కార్యాలయంలో గౌనివారిపల్లి, కొండాపురం ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఎంపీ పార్థసారథి వర్గం నుంచి గౌనివారిపల్లి పంచాయతీకి చెందిన వడ్డే రవి, మంత్రి సవిత వర్గం నుంచి కొండాపురం పంచాయతీకి చెందిన కృష్ణమూర్తి అధ్యక్ష పదవికోసం పట్టుబట్టారు. ఇరువురికీ సర్దిచెప్పేందుకు మండల నాయకులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే మాటామాటా పెరగడంతో ఇరు వర్గాల నాయకులు పార్టీ కార్యాలయంలోనే ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని ముష్టి యుద్ధానికి దిగారు. ఈ ఘటనలో పార్టీ కన్వీనర్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో గౌనివారిపల్లి సహకార సంఘం అధ్యక్ష ఎంపిక మరోసారి వాయిదా పడింది.

15 నుంచి గ్రామ సభలు నిర్వహించాలి