
80,109 జిల్లాలో రక్తపోటు బాధితులు 60,639 జిల్లాలో మధుమే
● ధర్మవరానికి చెందిన 32 ఏళ్ల సచివాలయ ఉద్యోగి ఇటీవల జ్వరంతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు మధుమేహం (షుగర్) వచ్చిందని, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సూచించారు. అయితే తమ ఇంట్లో ఎవరికీ షుగర్ లేదని, అయినా ఇంత చిన్న వయసుకే తనకు ఎలా వస్తుందని వైద్యులతో వాదనకు దిగాడు. మరోచోట పరీక్షించున్నా ఫలితంలో మార్పులేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు.
● హిందూపురం పట్టణానికి చెందిన 37 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి వారం రోజుల పాటు నిరంతరంగా తలనొప్పి రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికెళ్లి చికిత్స చేయించుకున్నాడు. రక్తపోటు అధికమైందని వైద్యులు చెప్పారు. ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించడం.. ఆహారపు అలవాట్లలో తేడా కారణంగా బీపీ పెరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. మసాలా, కారం, ఉప్పు తగ్గించాలని సూచించారు.
● 30 ఏళ్లకే బీపీ బారిన పడుతున్న వైనం
● ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్న మధుమేహం
● బద్ధకంతో అనారోగ్యం బారిన యువత
● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు
సాక్షి, పుట్టపర్తి
మారిన ఆహార అలవాట్లు, జీవన శైలి మనిషిని జబ్బుల బారిన పడేస్తోంది. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన ఉద్యోగాలతో చాలా మంది చిన్న వయస్సులోనే రక్తపోటు, మధుమేహం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నలుగురు కలిస్తే అందులో ఇద్దరికి బీపీ, మధుమేహం ఉంటోంది. ఇక వయసు మీద పడే కొద్దీ రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
మూడు పదుల వయస్సులోనే...
మారిన జీవనశైలి కారణంగా మూడు పదుల వయసులోనే.. బీపీ, షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ రెట్టింపు అవుతోంది. ఇక తీవ్ర ఒత్తిడితో మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మందే ఉన్నారు. పోటీ ప్రపంచంలో ప్రతి రంగంలోనూ పోటీ పెరిగింది. ఫలితంగా ప్రతి ఒక్కరూ ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలోనే సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడటం తదితర కారణాలతో లేని పోని రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. అయితే తాము బీపీ, షుగర్ బాధితులమని సగం మందికి తెలియకపోవడం గమనార్హం. ఏదైనా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్తే.. ఉన్నఫలంగా ఈ రెండూ బయటపడుతున్నాయి. ఆ తర్వాత పదే పదే ఆరోగ్యం గురించి ఆలోచించడంతో మరిన్ని రోగాలు వెంటాడుతున్నాయి. వయసు మీరిన తర్వాత రావాల్సిన రోగాలు.. సగం వయసులోనే సోకుతుండటంతో జీవితం ఒక్కసారిగా తలకిందులవుతోంది.
చిన్న వయసులోనే ఆస్పత్రుల చుట్టూ..
పుట్టుకతోనే ఆస్పత్రులు చూడాల్సిన కాలంలో బతుకుతున్న సమాజంలో.. డాక్టర్ల చుట్టూ తిరగడం నిరంతర ప్రక్రియగా మారింది. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన వెంటనే ఏదో రోగం వెంటాడుతోంది. మానసిక ఒత్తిళ్లతో బీపీ, షుగర్ వెంటనే పలకరిస్తున్నాయి. కంప్యూటర్ కాలంలో నిత్యం బిజీబిజీగా గడిపే వారంతా రోజులో గంటసేపు కూడా శారీరక వ్యాయామం గురించి పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎక్కువ మంది మధుమేహం బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఏదో రోగం సోకిన తర్వాత క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా పెద్దగా ఫలితం ఉండటం లేదు.
పట్టణాల్లోనే అధికం
రక్తపోటు, మధుమేహం బాధితుల సంఖ్యను ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. గ్రామాల కంటే పట్టణాలోనే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఆహారపు అలవాట్లతో పాటు ప్రతి ఒక్కరూ శారీరకంగా శ్రమిస్తారు. అలాగే మసాలా, ఫాస్ట్ ఫుడ్ అందుబాటులో ఉండవు. సమయానికి తింటూ నిత్యం ఏదో పనిలో ఉంటారు. అయితే పట్టణ ప్రజలు నిత్యం బిజీగా ఉండటంతో పాటు సమయానికి భోజనం తినరు. శారీరక వ్యాయామం చేయరు. పైగా పిజ్జాలు, ఫాస్ట్‌ఫుడ్, మసాల ఆహారానికి అలవాటు పడుతున్నారు. దీంతో చిన్న వయసులోనే బీపీ, షుగర్ రోగాల బారిన పడుతున్నారు. ఈక్రమంలో బీపీ, మధుమేహం మందుల విక్రయాలు కూడా భారీగా పెరుగుతున్నాయి.
మారిన జీవన శైలితో జబ్బుల బారిన జనం
నియంత్రణే శ్రీరామరక్ష
ప్రతి మనిషికీ ఆరోగ్యమే ప్రధానం. ఆరోగ్యం బాగుంటే కుటుంబంలో అందరూ ప్రశాంతంగా ఉంటారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే రోగాల బారిన పడకుండా ఉండవచ్చు. ఆహారపు అలవాట్లు బాగుంటే రోగాలు దరి చేరవు. శారీరక శ్రమ అవసరం. సోమరితనంతో లేనిపోని రోగాలు రావడం ఖాయం. ముందస్తు నియంత్రణ మార్గాలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష.
– డాక్టర్ ఫైరోజాబేగం, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి

80,109 జిల్లాలో రక్తపోటు బాధితులు 60,639 జిల్లాలో మధుమే