
మడకశిర పీఠానికి నేడు ఎన్నిక
మడకశిర: అధికారం ఉంది.. ఇక తమకు అడ్డేముందన్నట్లుగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులను పీఠాల నుంచి కూలదోస్తూ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మడకశిర నగర పంచాయతీ పీఠంపై కన్నేసిన టీడీపీ నేతలు కేవలం 5 స్థానాలతో విజయం సాధించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే వైఎస్సార్ సీపీకి చెందిన చైర్‌పర్సన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి వారిని పదవీచ్యుతులను చేసిన పచ్చ నేతలు బుధవారం జరిగే ఎన్నికలో తమవారిని పీఠాలపై కొలువుదీర్చేందుకు సిద్ధమయ్యారు.
ఉదయం 11 గంటలకు ఎన్నిక
మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నిక నిర్వహించనుంది. ఈ మేరకు ఈనెల 12న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు నగర పంచాయతీ కార్యాలయంలోని మీటింగ్ హాలులో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులంతా సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానాలు పంపారు. అలాగే ఎన్నిక అధికారిగా పెనుకొండ ఆర్డీఓ ఆనందకుమార్‌ను ఈసీ నియమించింది.
టీడీపీకి 5 స్థానాలే
నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులుండగా...గత మున్సిపల్ ఎన్నికల్లో 15 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. టీడీపీ కేవలం ఐదుగురు స్థానాలను మాత్రమే నిలబెట్టుకోగలిగింది. దీంతో వైఎస్సార్‌సీపీకి చెందిన లక్ష్మీనరసమ్మ చైర్‌పర్సన్‌గా, రామచంద్రారెడ్డి వైస్ చైర్మన్‌గా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే... నగర పంచాయతీపై టీడీపీ నేతలు కన్నేశారు. మెజార్టీ లేకపోయినా ఎలాగైనా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని కుట్రలు చేశారు. ఈ క్రమంలోనే కొందరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను భయపెట్టి, పలు రకాలుగా ప్రలోభాలకు గురి చేశారు. దీంతో 9 మంది కౌన్సిలర్లు టీడీపీ కండువా వేసుకున్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీకి చెందిన చైర్‌పర్సన్ లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డిపై అవిశ్వాస తీర్మాణం పెట్టి విజయం సాధించారు. దీంతో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులు కోల్పోగా.. మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు ఎన్నిక అనివార్యమైంది.
పదవులపై ఉత్కంఠ
చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు బుధవారం ఎన్నిక జరుగనుండడంతో ఎవరికి దక్కుతాయోనని ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో 15వ వార్డు కౌన్సిలర్ నరసింహరాజు చైర్మన్ గిరీపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచి పచ్చకుండువా కప్పుకున్న 17వ వార్డు కౌన్సిలర్ సుభద్ర కూడా చైర్‌పర్సన్‌గా కొలువుదీరాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీళ్లిద్దరిలోనే ఎవరో ఒకరికి పీఠం దక్కడం ఖాయంగా తెలుస్తోంది. ఇక వైస్ చైర్మన్ పదవిని వైఎస్సార్ సీపీ హయాంలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన రామచంద్రారెడ్డికి ఇచ్చారు. నగర పంచాయతీలో వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున ఈసారి కూడా వాల్మీకి వర్గానికి చెందిన వారికే వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని పలువురు కోరుతున్నారు. అయితే టీడీపీ నేతలు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్లకు ప్రాధాన్యం ఇస్తారా...లేదా అన్నది బుధవారం తేలనుంది.
చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై
కన్నేసిన టీడీపీ
రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో అరాచకం
ప్రలోబాలతో ఇప్పటికే పలువురు
వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు పచ్చకండువా
ఎన్నిక దూరంగా వైఎస్సార్ సీపీ
భారీ పోలీస్ బందోబస్తు
ఎన్నికల సందర్భంగా మడకశిర నగర పంచాయతీ కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు మడకశిర పట్టణ సీఐ నగేష్ తెలిపారు. కౌన్సిలర్లను మాత్రమే లోనికి అనుమతిస్తామని ఇతరులకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.