
రైలు కింద పడి రైతు మృతి
చెన్నేకొత్తపల్లి: ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ రైతు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. చెన్నేకొత్తపల్లి మంలడం ఆమిదాలకుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు (40)కు భార్య శమంతకమణితో పాటు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పొలం వద్దకు కాపలాకు వెళ్లిన ఆయన సోమవారం తెల్లవారుజామున ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొని, అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై హిందూపురం రైల్వే పోలీసులు కుఏసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
జేఎన్‌టీయూలో
1,935 సీట్ల తగ్గింపు
అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల పరిధిలో సీట్ల ఖరారు పూర్తయింది. జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో మొత్తం 69 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలకు గాను ఈ విద్యాసంవత్సరానికి 59,244 సీట్ల ఏఐసీటీఈ మంజూరు చేసింది. కళాశాలల నిజనిర్ధారణ కమిటీల సిఫార్సు మేరకు 1,935 సీట్లను తగ్తిస్తూ మొత్తం 57,309 ఇంజినీరింగ్ సీట్లను ఖరారు చేశారు. వీటిని ఏపీఈఏపీసెట్ –2025 వెబ్ ఆప్షన్ల ఎంపికకు అందుబాటులో తెచ్చేందుకు ఉన్నత విద్యామండలికి నివేదించారు. బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సులకు సంబంధించి 77,296 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలపగా, 74,145 సీట్లను భర్తీ చేసుకునేందుకు వర్సిటీ తుది ఆమోదం తెలిపింది.
కారులో నగదు చోరీ
గోరంట్ల: స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ప్రధాన రహదారి పక్కనే ఆపిన కారులో నుంచి నగదును దుండగులు అపహరించారు. వివరాలు.. గోరంట్ల మండలం మల్లాపల్లి గ్రామానికి చెందిన వసంతరావు, ఆయన సోదరుడు రామచంద్రరావు సోమవారం ఉదయం గోరంట్లలోని ఎస్‌బీఐ శాఖకు చేరుకుని రూ.7 లక్షలు డ్రా చేశారు. ఈ మొత్తాన్ని కారులో ఉంచుకుని రామచంద్రరావు కుమారుడి వివాహా వేడుకలు నిర్వహించేందుకు పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న వాసవీ మహాల్ ఫంక్షన్ హాల్‌ను చూసేందుకు వెళ్లారు. ఫంక్షన్ హాల్ ఎదుట కారు నిలిపి లాక్ చేసుకుని లోపలకు వెళ్లిన వారు తిరిగి వచ్చే లోపు కారు డోర్ అద్దం పగులగొట్టి ఉంది. కారులో ఉంచిన నగదు కనిపించలేదు. నగదు అపహరించారని నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో పెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప, సీఐ శేఖర్ తదితరులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
విద్యుత్ షాక్‌తో బాలికకు తీవ్రగాయాలు
ధర్మవరం అర్బన్: స్థానిక శారదా నగర్‌లో నిర్మాణంలో ఉన్న కట్టడంలో ఆడుకుంటున్న ఓ బాలిక విద్యుత్ షాక్‌తో తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన మేరకు ఒంగోలుకు చెందిన హరి, రిపిక దంపతులు ధర్మవరం పట్టణానికి వలస వచ్చి గృహ నిర్మాణ పనులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం శాంతినగర్‌లో ఇంటి నిర్మాణ పనులకు వెళ్లిన వారు తమతో పాటు 11 ఏళ్ల కుమార్తె వెంకటేశ్వరినీ పిలుచుకెళ్లారు. కట్టడం వద్ద ఇనుపరాడ్‌పై పడిన విద్యుత్ తీగను గమనించని వెంకటేశ్వరి ఆడుకుంటూ వెళ్లి దానిని తాకింది. దీంతో షాక్‌కు గురై కుప్పకూలడంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. దాదాపు 50 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలికకు వైద్యులు ప్రథమ చికిత్స అందజేసి, అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గోల్డ్ స్కీమ్ పేరిట చీటింగ్
గుంతకల్లు టౌన్: గోల్డ్ స్కీమ్ పేరిట గుంతకల్లుకు చెందిన జ్యువెలరీ షాప్ నిర్వాహకుడు నూరుల్లా రూ.లక్షల్లో కుచ్చుటోపీ పెట్టి ఉడాయించాడు. విషయం తెలియగానే బాధితులు పెద్ద సంఖ్యలో సోమవారం సాయంత్రం పాత గుత్తిరోడ్డులోని ఓ నర్సింగ్‌హోమ్ వద్ద ఉన్న సుల్తానియా జ్యువెలరీ షాపు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. జ్యువెలరీ షాపును అద్దెకిచ్చిన యజమాని ఖాళీ చేయిస్తామని అక్కడికి వెళ్లడంతో బాధితులంతా అతడితో వాదించారు. పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల నిమిత్తం బంగారు షాపు నిర్వాహకుడు నూరుల్లాకి తాము పోగు చేసుకున్న డబ్బును నెలానెల చెల్లించి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అతడిని ఇక్కడికి రప్పించి తమ డబ్బును తమకు ఇప్పించాలని బాధితులు కోరుతూ ఆర్‌డీఓ, టూటౌన్ పోలీసులను కలసి విన్నవించారు.

రైలు కింద పడి రైతు మృతి

రైలు కింద పడి రైతు మృతి