
అందని ప్రయోజనాలు.. పెన్షనర్ల దిగాలు
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పెన్షనర్ల పరిస్థితి దయనీయంగా మారింది. వారిపై బాబు సర్కారు కనికరం చూపడం లేదు. ఉద్యోగ విరమణ తరువాత రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను నెలలు గడుస్తున్నా అందించకపోవడంతో ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, ఎర్న్ లీవ్ వంటి ఆర్థిక ప్రయోజనాలు గత ఏడాది అక్టోబరు నుంచి పెండింగ్‌లో ఉంచారు. ఈ మొత్తం రూ.48 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
మట్టిఖర్చులూ పెండింగ్
పెన్షనర్ చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు తక్షణ సాయంగా మట్టిఖర్చుల (ఫ్యునరెల్ చార్జెస్) కింద రూ.25 వేలు ఇస్తారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ 100 మంది వరకూ పెన్షనర్లు మరణిస్తే వీరికి సంబంధించి మట్టి ఖర్చులను ఇవ్వకుండా ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచినట్లు తెలిసింది. 100 మందికి రూ.25 లక్షలు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. మట్టిఖర్చుల కింద తక్షణ సాయంగా అందించాల్సిన డబ్బునూ పెండింగ్‌లో పెట్టడం ప్రభుత్వ కర్కశత్వానికి అద్దం పడుతోంది.
గ్రాట్యూటీ, ఈఎల్‌కు ఎదురుచూపులు
ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం గ్రాట్యుటీ కింద గరిష్టంగా రూ.16 లక్షలు చెల్లి స్తుంది. జిల్లాలో గత ఏడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు వివిధ హోదాల్లో దాదాపు 200 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసినట్లు సమాచారం. వీరికి సంబంధించి గ్రాట్యుటీ సగటున రూ.14 లక్షలుగా చూసినా రూ.28 కోట్లు రావాల్సి ఉంటుంది.
● సర్వీసులో ఉండగా ఉద్యోగులు మిగుల్చుకున్న ఎర్న్ లీవ్‌లను (ఈఎల్) ఉద్యోగ విరమణ సమయంలో ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చి వాటికి డబ్బులు తీసుకుంటారు. ఇలా ఒక్కో ఉద్యోగి దాదాపు 300 రోజులు (పది నెలలు) ఎర్న్ లీవులను వెనక్కి ఇస్తారు. ఒక్కో ఉద్యోగికి ఈఎల్‌కు సంబంధించి 10 నెలల వేతనం ప్రభుత్వం చెల్లించాలి. సగటున నెలకు రూ.లక్ష వేసుకున్నా పది నెలలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలుగా 200 మందికి రూ.20 కోట్లను ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా చెల్లించ కుండా పెండింగ్‌లో ఉంచిందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం (నేడు) కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ పెన్షనర్లు ధర్నాకు పిలుపునిచ్చారు.
● మూడునెలలుగా మట్టి ఖర్చులనూ అందించని చంద్రబాబు సర్కారు
● పేరుకుపోయిన గ్రాట్యుటీ, ఈఎల్ బకాయిలు
● నేడు కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల ధర్నా
● రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న మల్లికార్జున (పేరు మార్చాం) గత ఏడాది నవంబరులో ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు గ్రాట్యుటీ రూ.16 లక్షలు, ఈఎల్ (ఎర్న్ లీవ్) డబ్బులు సుమారు రూ.10 లక్షలు నేటికీ అందలేదు. ఉద్యోగ విరమణ తరువాత పింఛను తప్ప ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఇప్పటికీ తనకు అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
● ఒక ఉపాధ్యాయుడు గత ఏడాది అక్టోబరులో ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు గ్రాట్యుటీ రూ.16 లక్షలు, ఈఎల్ రూ.12 లక్షలు నేటికీ అందలేదు. ఉద్యోగ విరమణ చేసి తొమ్మిది నెలలు అవుతున్నా బెనిఫిట్లు అందించలేదని, ఇటీవల ఇంట్లో శుభకార్యం చేసేందుకు రూ.10 లక్షలు అవసరమైతే తెలిసిన వారి నుంచి వడ్డీకి డబ్బు తీసుకున్నానని వాపోయారు.

అందని ప్రయోజనాలు.. పెన్షనర్ల దిగాలు