
వృద్ధురాలి ఆస్తి వెనక్కి ఇప్పించిన ఆర్డీఓ
ధర్మవరం అర్బన్: నానమ్మ ఆస్తిని రాయించుకుని ఆమె బాగోగులు పట్టించుకోని మనవడితో ఆస్తి వెనక్కి ఇప్పించారు ఆర్డీఓ మహేష్. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం వృద్ధురాలికి ఆస్తి వెనక్కి ఇస్తున్నట్లు తీర్పు పత్రాలను ఆర్డీఓ మహేష్ ఆమెకు అందించారు. వివరాలు.. పట్టణంలోని కొత్తపేటకు చెందిన 70 ఏళ్ల గాజుల వెంకట లక్ష్మమ్మ భర్త గాజుల తిప్పన్న కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమె పేరు మీద ఉన్న ఇంటిని మనవడు గాజుల అనిల్‌కుమార్ పేరున గిఫ్ట్‌డీడ్‌ను చేసింది. కాని ఆమె బాగోగులు పట్టించుకోకుండా వదిలేయడంతో పింఛన్ డబ్బుతో జీవిస్తోంది. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనవడిని డబ్బు అడిగినా పట్టించుకోలేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో గాజుల వెంకట లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు అధికారులు అనిల్‌కుమార్‌కు మూడుసార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో సీనియర్ సిటిజన్ నిర్వహణ సంక్షేమ చట్టం 2007 కింద ఆమె మనవడికి ఇచ్చిన గిఫ్ట్‌డీడ్‌ను రద్దు పరుస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు ఆర్డీఓ తెలిపారు.
అర్జీలపై అలసత్వం వహిస్తే చర్యలు
పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రవమంలో వచ్చిన అర్జీలపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ రత్న పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన 55 మందితో అర్జీలు స్వీకరించారు. సమస్యలపై ఎస్పీ నేరుగా పోలీస్ అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులో ఉన్న అంశాలను పరిశీలించి వాటి పూర్వాపరాలపై విచారణ చేసి చట్ట పరిధిలో తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీలు విజయకుమార్, ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, ఎస్పీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
నిరసన కార్యక్రమానికి అనుమతివ్వండి..
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీ బీసీ మైనార్టీలపై జరుగుతున్న దాడులను, వారి సమస్యలను కలెక్టర్‌కు తెలియజేసేందుకు ఈనెల 14న జిల్లా కేంద్రం పుట్టపర్తిలో నిరసన కార్యక్రమం తలపెట్టామని, ఇందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఎస్సీ జనసంఘ్ జాతీయ అధ్యక్షులు దానసగారిపల్లి కుళ్లాయప్ప కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ బీసీలపై దాడులు జరుగుతున్నాయన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి దాడులు చేస్తున్నారు. అనంతపురం ఆలుమూరు గ్రామంలో దళితుల భూమిని ఆక్రమిస్తే కొంత మంది దళితులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మరికొంత మంది బీసీ, మైనార్టీలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. పుట్టపర్తిలో జర్నలిస్ట్ డాక్యుమెంట్ తయారు చేస్తే దాడి చేసి కేసులు పెట్టారన్నారు. ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ భూమిని ఆక్రమించడమే గాక బీసీ నేతను అణగదొక్కేలా ఆయనపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఈదాడులపై ఈనెల 10న సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. బీసీ సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు సాకే ఆదినారాయణ, జైభీమ్ రామాంజనేయలు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
వేసవి శిక్షణ ప్రారంభం
ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయంలో సత్యసాయి విద్యా సంస్థలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, మానవతా విలువలు అన్న అంశంపై శిక్షణ ఇస్తున్నారు. నందగిరి, ప్రశాంతి నిలయం, అనంతపురం, బృందావన్ క్యాంపస్ విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు రామ కథ పేరుతో ఆధ్యాత్మిక సంగీత విభావరి నిర్వహించారు.
ప్రశాంతి నిలయంలో గ్లోబల్ మెడికల్ క్యాంప్
ప్రశాంతి నిలయంలో భక్తులకు ఆరోగ్య సేవలను అందించే లక్ష్యంతో సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గ్లోబల్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సోమవారం నార్త్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసిన క్యాంప్‌ను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్ రాజు ప్రారంభించారు. ఈనెల 11 వరకు క్యాంప్ నిర్వహించనున్నారు.
మా భూమిలోకి పోకుండా అడ్డుకుంటున్నారు
● ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జవాన్ ఫిర్యాదు
ప్రశాంతి నిలయం: తాము కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిలోకి వెళ్లకుండా కొందరు అడ్డుకుంటున్నారని సీఆర్‌పీఎఫ్ జవాన్ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. కనగానపల్లి మండలం కుర్లపల్లికి చెందిన వై.చెన్నారెడ్డి ఓడిశాలోని రాయ్‌ఘడ్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్నారు. ఆయన 2012లో కుర్లపల్లి గ్రామం సర్వేనంబర్ 248–4బీలో 5.16 ఎకరాల భూమిని బంధువుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. అయితే కొందరు వ్యక్తులు ఆ భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో జవాన్ 2017లో కోర్టులో పిటిషన్ వేసి.. ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అప్పటి నుంచి మూడేళ్లపాటు పంటలు సాగు చేశారు. 2021లో మళ్లీ ఆ భూమిని సాగు చేయకుండా దౌర్జన్యపరులు అడ్డుకున్నారు. దీంతో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న తమ భూమికే గ్రామంలో రక్షణ లేకపోతే ఎలా అని జవాన్ చెన్నారెడ్డి సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

వృద్ధురాలి ఆస్తి వెనక్కి ఇప్పించిన ఆర్డీఓ

వృద్ధురాలి ఆస్తి వెనక్కి ఇప్పించిన ఆర్డీఓ