సచివాలయ బది‘లీలలు’ | - | Sakshi
Sakshi News home page

సచివాలయ బది‘లీలలు’

Jul 9 2025 7:34 AM | Updated on Jul 9 2025 7:34 AM

సచివాలయ బది‘లీలలు’

సచివాలయ బది‘లీలలు’

అనంతపురం అర్బన్‌: ఇటీవల నిర్వహించిన ఉమ్మడి జిల్లా సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మెరిట్‌ (ర్యాంక్‌) ఆధారంగా బదిలీలు నిర్వహించాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా రాజకీయ సిఫారసులకు తలొగ్గారు. ఫలితంగా స్థానాల కేటాయింపులో అర్హులైన ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. దీంతో బాధిత ఉద్యోగులు న్యాయం కోసం కలెక్టర్‌ వినోద్‌కుమార్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారిలో అత్యధికంగా వ్యవసాయ శాఖ పరిధిలోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు, పోలీసు శాఖ పరిధిలోని మహిళ సంరక్షకులు (మహిళ పోలీసు) ఉన్నారు.

సిఫారసులకే పెద్దపీట

వ్యవసాయశాఖలో సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఓ ప్రహసనంలా సాగిందనే అరోపణలున్నాయి. బదిలీల ప్రక్రియలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్లకు మెరిట్‌ ఆధారంగా కాకుండా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు తొలి ప్రాధాన్యతనివ్వడం విమర్శలకు తావిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలో 2వ ర్యాంకు, ఉమ్మడి జిల్లాలో 5వ ర్యాంక్‌లో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ సుస్మితకు, అదే జిల్లాలో 3వ ర్యాంకు, ఉమ్మడి జిల్లాలో 6వ ర్యాంక్‌ ఉన్న జనార్ధన్‌కు.. దివ్యాంగుల కోటా కింది శిరీష్‌.. వారు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం కాకుండా అధికారులకు తమకు ఇష్టమొచ్చిన చోటికి పోస్టింగ్‌ ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. వీరు కోరిన ఆప్షన్లను వీరి తర్వాతి ర్యాంకు వారికి కట్టబెట్టినట్లుగా తెలిసింది. ఇదే తరహాలో చాలా మంది అగ్రికల్చర్‌ అసిస్టెంట్లకు అధికారులు ఇష్టానుసారంగా పోస్టింగ్‌ ఇచ్చినట్లు సమాచారం.

ఎటూ తేల్చని అధికారులు

బదిలీల ప్రక్రియలతో తమకు అన్యాయం జరిగిందంటూ కలెక్టర్‌కు ఈ నెల 2న అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతే కాక కలెక్టర్‌ను వారు ఇప్పటికి మూడుసార్లు కలసి న్యాయం చేయాలని కోరారు. ఇక 4న కలెక్టర్‌కు మహిళ సంరక్షకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి వారం రోజులవుతున్నా అధికారులు ఎటూ తేల్చలేదని బాధిత అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిలీవ్‌ కావాలని మరోవైపు అధికారుల నుంచి ఒత్తిళ్లు తీవ్రమయ్యాయని వాపోతున్నారు.

సత్వర పరిష్కారంతోనే ఊరట

అందిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. సత్వర పరిష్కారంతోనూ బాధితులకు న్యాయం చేకూరుతుంది. అయితే సచివాలయ ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో ఆ దిశగా చర్యలు లేకపోవడం గమనార్హం.

న్యాయం కోసం అనంత కలెక్టర్‌కు

ఉద్యోగుల ఫిర్యాదు

వ్యవసాయ, పోలీసు శాఖల్లో అడ్డగోలు వ్యవహారం

వ్యవసాయ శాఖలో తారస్థాయిలో

అక్రమాలు

వారమవుతున్నా ఫిర్యాదుపై

ఎటూ తేల్చని వైనం

సత్వర పరిష్కారంతోనే బాధితులకు ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement