
‘నేతన్న నేస్తం’ అమలు చేయండి
ధర్మవరం అర్బన్: చేనేత కార్మికులను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. ధర్మవరంలోని కేశవనగర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికులకు గత జగన్ ప్రభుత్వం ఏటా రూ.24వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ వచ్చిందని గుర్తు చేశారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, జీఎస్‌టీని పూర్తిగా రద్దు చేస్తామని, చేనేత కార్మికులకు రెండు సెంట్ల స్థలంతోపాటు వర్క్ షెడ్ కట్టిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీనిచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఇప్పటి వరకూ నేత కార్మికులకు చేసిన మేలంటూ ఏదీ లేదన్నారు. దీంతో చేనేత కార్మికులకు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందన్నారు. మరమగ్గాలను అరికట్టాల్సిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టించుకోక పోవడంతో పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమ అభివృద్ధి, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చేనేత జౌళిశాఖ మంత్రి సవిత ఎక్కడేగాని ప్రస్తావించక పోవడం బాధాకరమన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ సైతం చేనేత పరిశ్రమ, కార్మికుల సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఈ నేపథ్యంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎన్నికలకు ముందు చేనేత కార్మికులకు ఇచ్చిన హామీల అమలుపై ఈ నెల 10న జిల్లాకు వస్తున్న సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకటస్వామి, ఉపాధ్యక్షులు చెన్నంపల్లి శ్రీనివాసులు, విజయభాస్కర్, నాయకులు శ్రీనివాసులు, కేశవ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ డిమాండ్