
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్
ధర్మవరం అర్బన్: మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్, వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. స్థానిక వన్‌టౌన్ పీఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను వారు వెల్లడించారు. ధర్మవరంలోని గీతానగర్‌కు చెందిన చితా రమాదేవి(55)తో ఎదురింటిలో నివాసముంటున్న యలమకూరు రాజశేఖర్ అలియాస్ చాకలి శేఖర్ రెండేళ్ల క్రితం రూ.10వేలు అప్పు తీసుకుని, తిరిగి చెల్లించలేదు. అప్పు చెల్లించాలంటూ రమాదేవి రెండు పర్యాయాలు నిలదీసింది. దీంతో అవమానంగా భావించిన రాజశేఖర్ గత నెల 29న రమాదేవి ఇంట్లోకి చొరబడి ఆమెను కొట్టి అరవకుండా నోరు అదిమిపెట్టి రెండు చేతులతో కిందకు తోసేశాడు. అనంతరం టెంకాయ తాడు తీసుకుని ఆమె గొంతు బిగించాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో చనిపోయిందని భావించి అక్కడి నుంచి జారుకున్నాడు. కాసేపటి తర్వాత తేరుకున్న ఆమె స్థానికుల సాయంలో ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 4న ఆమె మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ నాగేంద్రప్రసాద్... ఆమె ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మృతి చెంది పోస్టుమార్టం అయ్యే వరకూ ఆస్పత్రిలోనే తచ్చాడుతున్న రాజశేఖర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో రమాదేవిని తానే హత్య చేసినట్లుగా ఆయన అంగీకరించడంతో మంగళవారం హత్య కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.