
రైల్వే రక్షణ కవచం
గుంతకల్లు: రైలు ప్రమాదాలు చోటు చేసుకునేందుకు ప్రధాన కారణం సిగ్నలింగ్ సమస్య. ఇప్పటి వరకూ జరిగిన ప్రమాదాల్లో అత్యధికంగా ఒకే లైనుపై రెండు రైళ్లు ఎదురెదురుగా దూసుకురావటం వల్ల చోటు చేసుకున్నవే ఉండడం బాధాకరం. ఈ తరహా ప్రమాదాలను నియంత్రించగలిగి ప్రయాణికుల భద్రతకు భరోసానిచ్చే దిశగా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూపొందించిన ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టీసీఈఎస్)ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. కవచ్ అనే పేరుతో పిలువబడే టీసీఈఎస్ పనితీరును ఇప్పటికే క్షేత్ర స్థాయిలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజయవంతంగా పరీక్షించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం గుంతకల్లు–డోన్ సెక్షన్‌లో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దశల వారీగా గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు.
రక్షణ కవచం పని చేస్తుంది ఇలా..
కవచ్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా రైళ్లలో మెక్రో ప్రాసెసర్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ (జీపీఎస్), యాంటీ కొలిజన్ పరికరాలను రైలు ఇంజన్‌లో ఏర్పాటు చేస్తారు. వీటిని రైల్వే ట్రాక్‌లకు అనుసంధానిస్తారు. ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ప్రతి స్టేషన్‌లో ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా రైలింజన్‌లోని కవచ్ యాంటీనాలు రేడియో ఫ్రీక్వెన్సీల స్వీకరిస్తూ వాటికి అనుగుణంగా పనిచేస్తుంటాయి. ప్రయాణంలో ఉండగా లోకో పైలెట్ రెడ్ సిగ్నల్ గుర్తించకపోవడం... సిగ్నల్ దాటి ముందుకెళ్లడం... పరిమితికి మించిన వేగంతో రైలు ప్రయాణించడం, రైలు వేగాన్ని లోకో పైలెట్ నియంత్రించలేకపోవడం తదితర సమస్యలు ఎదురైనప్పుడు కవచ్ వ్యస్థ స్వతంత్రంగా పనిచేయడం మొదలు పెడుతుంది. సిగ్నల్ జంప్ కాగానే వెంటనే లోకో పైటెల్‌ను అప్రమత్తం చేస్తుంది. బ్రేయ్‌లను నియంత్రిస్తుంది. నిర్ణీత దూరం లోపు అదే లైనులో మరో రైలును గమనించినప్పుడు స్వయం చాలకంగా రైలు కదలికను నిలిపివేస్తుంది.
కి.మీ రూ.50 లక్షలు వ్యయం..
గుంతకల్లు డివిజన్ దాదాపు 1450 కి.మీ మేర విస్తరించి ఉంది. ఇందులో వాడి–రేణిగుంట, గుత్తి–ధర్మవరం, ధర్మవరం–పాకాల. పాకాల–కాట్పాడి, నంద్యాల–యర్రగుంట్ల, గుంతకల్లు–బళ్లారి సెక్షన్లలో దశల వారీగా కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రసుత్తం గుంతకల్లు–డోన్ మధ్య ఉన్న 69 కి.మీలకు కి.మీకు రూ.50 లక్షలు చొప్పన దాదాపు రూ.345 కోట్లను రైల్వే శాఖ ఖర్చు చేసింది. ఈ మార్గంలో తిరిగే దాదాపు 20 నుంచి 30 రైలింజన్‌లో కవచ్ పరికరాలను ఏర్పాటు చేశారు. అలాగే వాడి–రేణిగుంట మధ్య 538 కి.మీల పరిధిలో ఉన్న 60 స్టేషన్లతో పాటు 200కు పైగా రైలింజన్‌ల్లో కవచ్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు.
సాంకేతిక లోపం కారణంగా ఒకే లైనుపై ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రైళ్లు ఢీకొన్న ఘటనలు గతంలో చాలా చోట్ల జరిగాయి. ఆయా ఘటనల్లో పలువురు ప్రయాణికులు చనిపోవడంతో పాటు రైల్వేకు భారీ నష్టాలూ చేకూరాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతా చర్యల్లో భాగంగా రైళ్లు పరస్పరం ఢీకొనకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే శాఖ సమకూర్చుకుంది. దాని పేరే ‘కవచ్’.
కవచ్ వ్యవస్థతో ఆటోమేటిక్‌గా
ఆగిపోనున్న రైళ్లు
ప్రస్తుతం గుంతకల్లు–డోన్
సెక్షన్ మార్గంలో ఏర్పాటు
త్వరలో గుంతకల్లు డివిజన్‌లోని
అన్ని సెక్షన్లలో ఏర్పాటుకు చర్యలు
ప్రయాణికుల భద్రతే లక్ష్యం
ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రైలు ప్రమాదాలు నివారణకు పటిష్ట చర్యలు తీసుకున్నాం. ఇందులో భాగంగా కవచ్ లాంటి అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చాం. ప్రస్తుతం గుంతకల్లు – డోన్ సెక్షన్‌లో కవచ్‌ను ఏర్పాటు చేశాం. త్వరలో గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా అన్ని సెక్షన్లలో ఈ పరికరాలను ఏర్పాటు చేయనున్నాం.
– చంద్రశేఖర్, సీనియర్ డీఎస్‌టీఈ,
గుంతకల్లు

రైల్వే రక్షణ కవచం