ఆకుతోటపల్లి వాసులకు దుద్దుకుంట పరామర్శ | - | Sakshi
Sakshi News home page

ఆకుతోటపల్లి వాసులకు దుద్దుకుంట పరామర్శ

Jul 9 2025 7:34 AM | Updated on Jul 9 2025 7:34 AM

ఆకుతో

ఆకుతోటపల్లి వాసులకు దుద్దుకుంట పరామర్శ

ఓడీచెరువు: కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన ఓడీ చెరువు మండలం ఆకుతోటపల్లి వాసులను పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి పరామర్శించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న వారిని నేరుగా కలసి మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. అనంతరం బాధితులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దామోదరరెడ్డి, ఎంపీపీ పర్వీన్‌భాను, పార్టీ టౌన్‌ కన్వీనర్‌ కోళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్ట్‌

రూ.12 లక్షల విలువైన సొత్తు రికవరీ

అనంతపురం: ఇళ్లలోకి ప్రవేశించి బంగారు నగలు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అపహరిస్తున్న విక్కీ అలియాస్‌ షామీర్‌తో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేస్తున్న ఫరూక్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతపురం రెండో పట్టణ పీఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ శ్రీకాంత్‌ యాదవ్‌ వెల్లడించారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన సలీం కుమారుడు మాదిరి కర్రి విక్కీ అలియాస్‌ షామీర్‌ (20) తన ఆరేళ్ల వయసులోనే పారిపోయి అనంతపురానికి చేరుకున్నాడు. అప్పట్లో విజయనగర కాలనీలోని అనాథ ఆశ్రమంలో ఉంటూ రాజేంద్ర మున్సిపల్‌ హైస్కూల్‌లో 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఈ క్రమంలోనే చిల్లర దొంగతనాలు చేస్తూ రాత్రి సమయాల్లో ఇళ్లలోకి చొరబడి చోరీలు చేయడం ప్రవృత్తిగా మార్చుకుని, చివరకు దొంగతనాల్లో రాటుదేలాడు. 2024, నవంబర్‌లో అనంతపురంలోని విద్యుత్‌ నగర్‌ సర్కిల్‌లో ఉన్న ఇంట్లోకి వారం వ్యవధిలో రెండు సార్లు చొరబడి రెండు బంగారు గాజులు అపహరించాడు. అలాగే ఈ ఏడాది జూన్‌లో ఓ యమహా బైక్‌, గోవాలో ఐ ఫోన్‌, ఆపిల్‌ ల్యాప్‌టాప్‌ను అపహరించాడు. ఆయా కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ప్రనస్నాయపల్లి రైల్వే గేటు వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న షామీర్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో వరుస చోరీలు వెలుగుచూశాయి. గతంలో చోరీ చేసిన సొత్తుతో పాటు పలు సందర్భాల్లో అపహరించిన 8 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లను రికవరీ చేశారు. అలాగే నాలుగు సెల్‌ఫోన్లను కొనుగోలు చేసిన ఫరూక్‌ అరెస్ట్‌ చేసి నాలుగు సెల్‌ఫోన్లను రికవరీ చేశారు. ఇద్దరి నుంచి రికవరీ చేసిన మొత్తం ఆరు తులాల బంగారు గాజులు, 12 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక స్కూటీ విలువ రూ.12 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సీసీఎస్‌ సీఐ వలిబాషా, జయపాల్‌రెడ్డి, టూ టౌన్‌ సీఐ శ్రీకాంత్‌యాదవ్‌, ఎస్‌ఐ రుష్యేంద్రబాబును ఎస్పీ పి.జగదీష్‌ అభినందించారు.

గురుకులంలో

విద్యార్థినికి గాయాలు

గుత్తి రూరల్‌: మండలంలోని రజాపురంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థినికి అనుమానాస్పద స్థితిలో గాయాలయ్యాయి. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన మేరకు... పుట్లూరు మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన చిన్న కుళ్లాయప్ప, వరలక్ష్మి దంపతుల కుమార్తె పి.మైథిలి.. గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం తరగతి గదిలో రెండు కాళ్లు విరిగి తీవ్ర గాయాలతో పడి ఉంది. గమనించిన గురుకుల సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించారు. కాగా ఘటనపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె మాత్రం తరగతి గదిలో డెస్క్‌ మధ్యలో ఇరుక్కొని కింద పడటంతో కాళ్లు విరిగాయని చెబుతోందని, అయితే తమకు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ వెంకటేశ్వర్లు మంగళవారం పాఠశాలలో విచారణ చేపట్టారు.

ఆకుతోటపల్లి వాసులకు  దుద్దుకుంట పరామర్శ 1
1/1

ఆకుతోటపల్లి వాసులకు దుద్దుకుంట పరామర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement