
రైలు ప్రయాణికులకు మరింత భద్రత
ధర్మవరం అర్బన్: రైల్వే ప్రయాణికులకు మరింత భద్రత కల్పించనున్నట్లు ఆర్‌పీఎఫ్ సౌత్ సెంట్రల్ జోన్ డీఐజీ షదాన్ ఖాన్ తెలిపారు. సౌత్ సెంట్రల్ పరిధిలోని ధర్మవరం ఆర్‌పీఎఫ్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. పరిసరాలను, పలు పరికరాల పనితీరు పరిశీలించారు. అనంతరం ఆర్‌పీఎఫ్ మహిళా వసతి గృహంలో పూల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. రైల్వే శాఖలో మహిళా ఉద్యోగుల భద్రతాపరంగా మహిళా వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో గుంతకల్లు డివిజనల్ ఆర్‌పీఎఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఆకాష్‌కుమార్ జైస్వాల్, సీఐ నాగేశ్వరరావు, అధికారులు రోహిత్‌గౌడ్, కోటేశ్వరరావు పాల్గొన్నారు.