
దిగజారుతున్న విద్యా ప్రమాణాలు
అనంతపురం ఎడ్యుకేషన్: మెగా పీటీఎం, యోగాంధ్ర, ట్రైనింగులు తదితర బోధనేతర కార్యక్రమాలకు ఉపాధ్యాయులను మళ్లించడంతో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రామాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ వేదికగా ఎస్టీయూ రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. జిల్లా నుంచి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి .రామాంజనేయులు మాట్లాడారు. ప్రశాంతమైన వాతావరణంలో బోధన అభ్యసన కార్యక్రమాలు జరిగేలా విద్యాశాఖ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు, 12వ పీఆర్సీ వేసి వెంటనే ఐఆర్ ప్రకటించాలన్నారు. అలాగే సీపీఎస్ బకాయిలు చెల్లించాలని, సరెండర్ లీవ్ ఎన్‌క్యాస్మెంట్ మూడేళ్లయినా చెల్లించలేదన్నారు. పురపాలక, నగరపాలక పాఠశాలల్లో మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అర్హత కలిగిన ఉపాధ్యాయులతో నెలవారీ ప్రమోషన్ల ద్వారా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి రామాంజనేయులు