
అద్భుతం.. అద్వితీయం
పట్టు వస్త్రంపై దేశంలోని అన్ని భాషలలో
శ్రీరామ నామాలను రూపొందించిన దృశ్యం
ధర్మవరం: అతడో సాధారణ చేనేత కార్మికుడు.. అద్భుతమైన మేఽథాసంపత్తి ఉంది.. పట్టుచీరల డిజైన్‌లను రొటీన్‌కు భిన్నంగా కళాత్మకంగా రూపొందించడం అతడి ప్రత్యేకత. 2009లో హ్యాండ్‌లూమ్ విభాగంలో క్లస్టర్ డిజైనర్‌గా ఉద్యోగం పొందారు. అప్పటి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు, ప్రశంసా పత్రాలు పొందారు. తనలోని కళను పలువురికి నేర్పుతూ పట్టు విశిష్టతను ప్రపంచానికి డిజైన్‌ల రూపంలో చాటుతున్న ధర్మవరానికి చెందిన నాగరాజు ఈ ఏడాది ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ డిజైనర్ అవార్డు అందుకోనున్నారు.
సాంబ సినిమాతో ఆరంభం
ధర్మవరం పట్టణానికి చెందిన జూజారు నాగరాజు మగ్గం నేసుకుంటూ డిగ్రీ వరకు చదివారు. డిజైనింగ్ మీద మక్కువతో బెంగుళూరు, హైద్రాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశారు. అనంతరం పట్టుచీరలపై కళాత్మకంగా వైరెటీ డిజైన్‌లు రూపొందిస్తూ తనలోని కళాకారుడిని ఈ లోకానికి పరిచయం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సాంబ చిత్రంలో ఓ సన్నివేశానికి గానూ శంఖు, చక్రం, నామాలతో కూడిన డిజైన్‌ను బంగారు తాపడంతో పట్టు వస్త్రంపై 2004లో నాగరాజు రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిజైన్ ప్రాచూర్యం పొందడంతో నాగరాజుకు పేరు వచ్చింది. ఆ తర్వాత 2009లో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం ప్రతిభ ఉన్న వారికి ఔట్ సోర్సింగ్ ద్వారా హ్యాండ్‌లూమ్‌లో డిజైనర్ ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ధర్మవరం హ్యాడ్‌లూమ్ క్లస్టర్ డిజైనర్‌గా నాగరాజుకు ఉద్యోగం వచ్చింది. ధర్మవరంతో పాటు ముదిరెడ్డిపల్లి, మంగళగిరి తదితర ప్రాంతాలలో చేనేత కార్మికులకు డిజైనింగ్ రంగంలో శిక్షణ ఇచ్చారు.
అందుకున్న అవార్డులు
● 2006లో ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్ డెవలప్‌మెంట్‌లో ప్రతిభ చాటినందుకు గాను రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు.
● 2020, మార్చిలో ఢిల్లీలో నేషనల్ హ్యాండ్‌లూమ్ డెవల్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాతీయ అవార్డును అందుకున్నారు. మహాత్ముని ఉప్పు సత్యాగ్రహం చిత్రాలను పట్టు వస్త్రంపై రూపొందించినందుకు గాను ఈ అవార్డు దక్కింది.
● 2024, ఆగస్టు 15న ఏపీ అట్ హోం కార్యక్రమంలో భాగంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో చేనేతల తరపున పాల్గొనే అవకాశం దక్కింది.
● ఈ ఏడాది మార్చిలో రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన వివిధ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొని చేనేత విశిష్టతను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు వివరించారు.
● ఈ ఏడాది ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే చేనేత దినోత్సవంలో ఉత్తమ డిజైనర్ అవార్డును నాగరాజును అందుకోనున్నారు.
పట్టు వస్త్రాలపై విభిన్నమైన డిజైన్లతో ఆకట్టుకుంటున్న నాగరాజు
ఉత్తమ డిజైనర్‌గా జాతీయస్థాయి అవార్డులు అందుకున్న సాధారణ చేనేత కార్మికుడు
ఎంతో ఆనందంగా ఉంది
ప్రశంసలు అందుకున్న డిజైన్‌లు
ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో పట్టు వస్త్రాలపై తాజ్‌మహల్ చిత్రాలను రూపొందించి ప్రదర్శించారు.
2016లో లేపాక్షి ఆలయంలోని శిల్పాలను పట్టు వస్త్రంపై చేనేత మగ్గం సాయంతో అద్భుతంగా తయారు చేసి ప్రదర్శించారు.
2017, ఫిబ్రవరిలో ఇస్రో రాకెట్ ప్రయోగాల విజయవంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇస్రో శాటిలైట్‌లు, రాకెట్ చిత్రాలను పట్టు వస్త్రంపై తయారు చేసి విజయవాడలో ప్రదర్శించారు.
ప్రముఖ పుణ్య క్షేత్రం పానకాల లక్ష్మీనరసింహస్వామి చిత్రం, గాలి గోపురాన్ని పట్టు వస్త్రంపై డిజైన్ చేసి ఆలయానికి అందజేశారు.
2019లో గాంధీ జయంతిని పురస్కరించుకుని మహాత్ముని దండీ యాత్రను పట్టు వస్త్రంపై రూపొందించి ఢిల్లీలో జరిగిన నేషనల్ హ్యాండ్‌లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రాష్ట్రం తరపున ప్రదర్శించారు.
2019, డిసెంబర్‌లో సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టు వస్త్రంపై సీఎం జగన్ చిత్రాన్ని రూపొందించి హ్యాండ్‌లూమ్ కార్యాలయం తరపున నేతన్న నేస్తం పథకం ప్రారంభంలో ధర్మవరంలో జగనన్నకు బహూకరించారు.
ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాధర్ ఫెర్రర్ సతీమణి అన్నే ఫెర్రర్ చిత్రాన్ని పట్టు వస్త్రంపై తయారు చేసి ఆమెకు అందజేశారు.
2021లో అయోధ్యలోని రామయ్యకు కానుకగా శ్రీరామ కోటి పట్టు వస్త్రాన్ని తయారు చేసి పంపారు.
2022లో త్రీడీ శారీ తయారు చేసి ఒకే పట్టు చీరపై మూడు డిజైన్‌లు రూపొందించి అబ్బుర పరిచాడు.
ఈ ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ చిత్రంతో కూడిన పట్టు వస్త్రాన్ని తయారు చేసి ఆమెకు బహూకరించారు.
సాధారణ చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్న నేను.. ఆసక్తితో డిజైనర్‌గా శిక్షణ తీసుకుని ఎన్నో విభిన్నమైన డిజైన్‌లను రూపొందించాను. చేనేతల సత్తాను జాతీయ స్థాయిలో చాటాలన్నదే నా సంకల్పం. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులతో పాటు ఎన్‌హెచ్‌డీసీ తరపున జాతీయ అవార్డు అందుకున్నా. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉత్తమ డిజైనర్‌గా జాతీయస్థాయి అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉంది.
–నాగరాజు, డిజైనర్, ధర్మవరం

అద్భుతం.. అద్వితీయం