
టిప్పర్ ఢీ – వృద్ధుడి మృతి
ముదిగుబ్బ: టిప్పర్ ఢీ కొనడంతో ముదిగుబ్బ మండలం రామస్వామినాయక్ తండాకు చెందిన శ్రీనివాసులునాయక్‌ను(62) దుర్మరణం పాలయ్యాడు. స్వగ్రామం నుంచి ముదిగుబ్బ–పుట్టపర్తి రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొంది. మృతునికి భార్య తులసీబాయి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వివాహిత ఆత్మహత్య
పరిగి: మండలంలోని మోదా పంచాయతీ పుట్టగూర్లపల్లిలో వివాహిత మంజుల(22) ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ రంగడుయాదవ్ తెలిపిన మేరకు.. పుట్టగూర్లపల్లి నివాసి శ్రీనివాసులు తన కుమార్తె మంజులను అదే గ్రామానికి చెందిన సమీప బంధువు కుమారుడు జయచంద్రకు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించాడు. కూలి పనులతో జీవనం సాగించేవారు. ఏడాది కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె ఆదివారం నొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. గమనించిన బంధువులు వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్‌ఎస్ మందిరంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక ఉంటుందని, ప్రజలు తమ సమస్యలపై నేరుగా అర్జీలు అందజేయవచ్చని పేర్కొన్నారు.
నేడు పోలీస్ కార్యాలయంలో...
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేస్తే పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రా క్రికెట్ జట్టులో చోటు
అనంతపురం: ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకూ ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో జరిగే వన్డే క్రికెట్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఆంధ్రా అండర్–19 పురుషుల క్రికెట్ జట్టులో జిల్లాకు నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో కోగటం హనీష్ వీరారెడ్డి, టీవీ సాయి ప్రతాపరెడ్డి, ఎ.జయంత్ కృష్ణ (తాడిపత్రి), ఎం.భువనేశ్వర్ (గుత్తి), ఎస్.రెహాన్ (గుంతకల్లు) ఉన్నారు.