
‘విశ్వ’ ఖ్యాతి..అధోగతి
అనంతపురం: రాయలసీమకే తలమానికంగా భాసిల్లుతున్న జేఎన్‌టీయూ (అనంతపురం) క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. అనుబంధ కళాశాలలన్నీ అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా పొందుతుండడంతో వర్సిటీ పాత్ర పరిమితం కానుంది. అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలే వర్సిటీకి వెన్నుదన్ను. ఆయా కళాశాలల విద్యార్థులు చెల్లించే యూనివర్సిటీ కామన్ సర్వీసెస్ (యూసీఎస్) ఫీజులు వర్సిటీకి అతిపెద్ద ఆర్థిక వనరు. అయితే.. అనుబంధ కళాశాలల నుంచి స్వయం ప్రతిపత్తి కళాశాలలు (అటానమస్)గా మార్పు చెందుతున్నాయి. నూతన జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం ప్రతి ఇంజినీరింగ్ కళాశాల అటానమస్‌గా మార్పు చెందాలని నిర్దేశించడం ఇందుకు ఊతంగా నిలుస్తోంది. జేఎన్‌టీయూ (అనంతపురం) పరిధిలో రాయలసీమ, నెల్లూరు జిల్లాలో మొత్తం 69 ఇంజినీరింగ్ కళాశాలలు అనుబంధంగా ఉండేవి. ఇందులో ఇప్పటికే 45 కళాశాలలు అటానమస్ హోదా దక్కించుకున్నాయి. మిగిలిన 24 ఇంజినీరింగ్ కళాశాలలు ప్రస్తుత (2025–26) విద్యా సంవత్సరానికి అనుబంధ కాలేజీలుగా వర్సిటీకి దరఖాస్తు చేసుకున్నాయి. వచ్చే సంవత్సరం నుంచి ఇవి కూడా స్వయం ప్రతిపత్తి పొందనున్నాయి. న్యాక్‌లో ఏ రకమైన గ్రేడ్ ఉన్నా అటానమస్ హోదా వస్తుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకుంటే అటానమస్ హోదా ఇచ్చేస్తున్నారు. అనుబంధ కాలేజీలన్నీ అటానమస్ పొందితే జేఎన్‌టీయూ కేవలం క్యాంపస్ కళాశాల, పులివెందుల, కలికిరి, ఓటీపీఆర్‌ఐ కాలేజీలకే పరిమితం కానుంది.
వర్సిటీ బాధ్యతలు నామమాత్రం
అనుబంధ కాలేజీలన్నీ అటానమస్ పొందితే జేఎన్‌టీయూ(ఏ) కేవలం డిగ్రీలు అందించే కార్యాలయంలా మారిపోనుంది. సిలబస్ రూపకల్పన, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, మార్కుల కేటాయింపులో అటానమస్ కళాశాలలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. మార్కులు వర్సిటీకి పంపితే స్నాతకోత్సవ డిగ్రీ మాత్రం అందజేస్తుంది. ఈ నేపథ్యంలో వర్సిటీ బాధ్యతలు నామమాత్రం కానున్నాయి. ఒకప్పుడు ఏటా లక్ష మంది విద్యార్థులు వర్సిటీ కింద ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 10 వేలకు పడిపోయింది. వచ్చే ఏడాది మరింత తగ్గి కేవలం మూడు వేలకు పరిమితం కానుంది. దీంతో యూసీఎస్ ఫీజులు కూడా వర్సిటీకి రావు.
పురోగతికి కానరాని చర్యలు
జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో విద్యార్థులు లేని పరిస్థితి ఏర్పడనుంది. ఈ క్రమంలో క్యాంపస్ కళాశాలలో అడ్మిషన్లు గణనీయంగా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాలానుగుణంగా పరిశ్రమల అవసరాలకు తగిన మానవ వనరులను అందించే దిశగా ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు సరికొత్త కోర్సులు అమలు చేస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. అయితే 78 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన జేఎన్‌టీయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకునే క్యాంపస్ కళాశాలలో కొత్త కోర్సుల అమలుకు యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ కోర్సును ప్రవేశపెట్టేందుకు 2023లోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. పాలకమండలి ఆమోదం సైతం లభించింది. అయితే, ఇందుకు సంబంధించిన ఫైలు రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో పెండింగ్ పడిపోయింది. దీనిపై వర్సిటీ అధికారులు శ్రద్ధ పెట్టడం లేదు.
తగ్గిపోతున్న జేఎన్‌టీయూ(ఏ) ప్రాభవం
ఇప్పటికే 45 కళాశాలలకు అటానమస్
వచ్చే ఏడాది అన్ని కళాశాలలకూ స్వయం ప్రతిపత్తి
క్యాంపస్, పులివెందుల, కలికిరి కళాశాలలకే పరిమితం కానున్న వర్సిటీ