
మానవతా విలువలతోనే జీవితం సంపూర్ణం
ప్రశాంతి నిలయం: సత్యసాయి బోధనల మేరకు మనిషి మానవతా విలువలు పాటించడం ద్వారా సంపూర్ణుడు అవుతాడని అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు విషాల్‌రావు పేర్కొన్నారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. రెండోరోజు మంగళవారం సత్యసాయి విద్యాసంస్థల అనంతపురం క్యాంపస్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వారు నిర్వహించిన ఆధ్యాత్మిక సంగీత ప్రదర్శనతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. అంతకుముందు విషాల్‌రావు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్‌రాజు, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి, వైస్ చైర్మన్ నిమిష్ పాండ్య సత్యసాయి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌ను ఆవిష్కరించారు.
నేడు మానవతా విలువల సదస్సు
మానవతా విలువలపై విస్తృత స్థాయిలో చర్చించేందుకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ప్రశాంతి నిలయంలో మానవతా విలువలపై సదస్సు జరగనుంది. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత ఉదయం 8 గంటలకు వేదపఠనంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 8.45 గంటలకు జ్యోతి ప్రజ్వలన, 8.55 గంటలకు సదస్సు లక్ష్యాన్ని వివరిస్తూ ప్రసంగం, 9 గంటలకు సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ నిమిష్ పాండ్య ప్రారంభోపన్యాసం ఉంటుంది. రామకృష్ణ మిషన్, వివేకానంద ఎడ్యూకేషనల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కోల్‌కత్తా వైస్ చైర్మన్ స్వామి సర్వోత్తమా నంద మానవతా విలువపై ప్రసంగిస్తారు. తర్వాత ముఖ్య అతిథి హరిభౌ కృష్ణారావు బాగ్డే ప్రసంగిస్తారు. సాయంత్రం సదస్సు తీర్మానాలను వివరిస్తారు.

మానవతా విలువలతోనే జీవితం సంపూర్ణం