Hindupur YSRCP Candidate Deepika Comments On Nandamuri Balakrishna - Sakshi
Sakshi News home page

చుట్టపుచూపుగా వచ్చే ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రజలే బుద్ధి చెప్పాలి...

Published Mon, Jul 10 2023 1:06 AM

- - Sakshi

హిందూపురం: వచ్చే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించి పార్టీ జెండా ఎగరేద్దామని నియోజకవర్గ సమన్వయకర్త దీపిక పిలుపునిచ్చారు. సమన్వయకర్తగా నియమితులయ్యాక తొలిసారిగా ఆదివారం హిందూపురం వచ్చిన ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తూమకుంట చెక్‌పోస్టు నుంచి హిందూపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మెయిన్‌ బజారు గాంధీ సర్కిల్‌ వద్ద గజమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి దీపిక మాట్లాడారు.

ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ నియోజకవర్గ ప్రజల సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. చుట్టపు చూపుగా వస్తూ వెళ్తూ ఓటరు తీర్పును అపహాస్యం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. పార్టీ నాయకులు, ప్రజలకు రుణపడి ఉంటానని, హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. హిందూపురం సమన్వయకర్తగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ నాయకులందర్ని కలుపుకుని ముందుకు సాగుతానన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే ధ్యేయంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

వై నాట్‌ 175 అన్న జగనన్న నినాదాన్ని నిజం చేద్దామన్నారు. నాయకుల ఆప్యాయత, ఆశీర్వాదాలు ఎల్లవేళలా తనపై ఉండాలని కోరారు. త్వరలోనే పార్టీ నాయకులతో కలిసి ప్రజలతో మమేకమవుతానని తెలిపారు. సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిద్దామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా జగనన్న చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అందరికీ సమన్యాయం చేయడం ఆయనతోనే సాధ్యమైందన్నారు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘనీ మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పక్షపాతి అన్నారు.

మైనార్టీల సంక్షేమానికి 4 శాతం రిజర్వేషన్‌ కల్పించి వైఎస్సార్‌ ఎంతో మేలు చేశారని తెలిపారు. తండ్రిని మించి సీఎం వైఎస్‌ జగన్‌ పాలన సాగిస్తున్నారన్నారు. చంద్రబాబు మళ్లీ కళ్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన్ను నమ్మరాదని సూచించారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో పవన్‌ కల్యాణ్‌కు ఒక్కటి కూడా లేవని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు హిందూపురం ప్రజల గురించి ఆలోచించే టైం లేదని ఎద్దేవా చేశారు. దీపికకు మనందరి మద్దతు అందిద్దామని పిలుపునిచ్చారు.

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బలరామిరెడ్డి, కౌన్సిలర్లు శివ, షాజియాలు మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా ముందుకుపోదామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొటిపి హనుమంతరెడ్డి, పెనుకొండ మాజీ సమన్వయకర్త నాగలూరు బాబురెడ్డి, కౌన్సిలర్లు మారుతిరెడ్డి, ఆసీఫ్‌, రామచంద్ర, గిరి, జయప్ప, పురశురాం, నాగేంద్రబాబు, రోషన్‌, పార్వతీ, నాగేంద్రమ్మ, రహమత్‌బీ, ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ఉపేంద్రరెడ్డి, నాగమణి, జనార్దన్‌రెడ్డి, లక్ష్మినారాయణ, మండల కన్వీనర్‌ నారాయణస్వామి, వైస్‌ ఎంపీపీ అంజన్‌రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, నక్కలపల్లి శ్రీరామిరెడ్డి, సర్పంచ్‌లు శంకర్‌రెడ్డి, నాగరత్నమ్మ, నాయకులు డిష్‌ నాగరాజు, మహేష్‌, చంద్రశేఖర్‌, అబీబ్‌, ఆనంద్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, తిమ్మిరెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement