ఆ మూడు పురాల్లో అనిశ్చితి | - | Sakshi
Sakshi News home page

ఆ మూడు పురాల్లో అనిశ్చితి

Oct 15 2026 11:59 AM | Updated on Oct 15 2026 11:59 AM

● కావలి, గూడూరు మున్సిపాలిటీలు, అల్లూరు నగర పంచాయతీ

ఎన్నికలకు బ్రేక్‌

● పంచాయతీల విలీనంపై

సుప్రీంకోర్టు నోటీసులు

● ఈ దఫా కూడా ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కాని పరిస్థితి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/గూడూరు: జిల్లాలో కావలి, గూడూరు మున్సిపాలిటీలతోపాటు అల్లూరు నగర పంచాయతీల ఎన్నికల ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది. 2020లో మున్సిపాలిటీ పరిధిలోని చుట్టుపక్కల గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గెజిట్‌ ప్రకటించింది. అయితే అప్పట్లో ఈ విలీనాల ప్రక్రియలను వ్యతిరేకిస్తూ కొన్ని పంచాయతీలు హైకోర్టును ఆశ్రయించడంతో గత ఐదేళ్లుగా ఎన్నికల జరగక పాలకవర్గాలు లేక ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగింది. తాజాగా ఈ వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికలకు మార్గం సుగమం అయిందనుకున్న తరుణంలో సుప్రీంకోర్టుకు వెళ్లడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. ఈ దఫా కూడా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. పట్టణాభివృద్ధిని కాంక్షిస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కావలి మున్సిపాలిటీని విస్తరిస్తూ.. మద్దూరుపాడు, ముసునూరు, చౌదరిపాళెం, బుడమగుంట పంచాయతీలను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. గూడూరు పరిధిని విస్తరించేందుకు నెల్లటూరు, చెన్నూరు, దివిపాళెం, చిల్లకూరు, పోటుపాళెం, పురిటిపాళెం గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మేజర్‌ పంచాయతీగా ఉన్న అల్లూరును నగర పంచాయతీగా స్థాయిని పెంచుతూ సింగపేట, నార్తుమోపూరులను ఇందులో విలీనం చేసింది.

రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన

నోటీసులు లేకుండా విలీనం చెల్లదని, చట్టంలో షోకాజ్‌ నోటీసులు ఇచ్చే నిబంధన అమల్లో ఉండగా, కేవలం సవరణ చట్టం ద్వారా నోటీసు ఇచ్చినట్లుగా పరిగణించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, పిటీషనర్లు గూడూరు మున్సిపాలిటీకి సంబంధించి నందవరం కృష్ణవేణి, ఎద్దుల సుబ్బారెడ్డి, చల్లా కన్నయ్య తమ వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 క్యూ ప్రకారం గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా మార్చేటప్పుడు జనాభా సాంద్రత, వ్యవసాయేతర ఉపాధి, స్థానిక ఆదాయం వంటి అంశాలను తప్పని సరిగా పరిగణలోకి తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో అవేవి పరిశీలంచకుండా చట్ట సవరణ ద్వారా విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటీషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాదులు ఆర్‌.రఘునందన్‌రావు, వెంకటరఘువంశీ వాదించారు. విలీన ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ దాఖలైన స్పెషల్‌ లీవ్‌ పిటీషన్‌ను జస్టిస్‌ పీఎస్‌నరసింహ, జస్టిస్‌ అలోక్‌ అరాధేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

హోదా వచ్చినా.. ఎన్ని‘కలే’

జిల్లాలో అల్లూరుకు ఒక చరిత్ర ఉంది. 2009 వరకు అల్లూరు నియోజకవర్గ కేంద్రంగా భాసిల్లింది. మేజర్‌ పంచాయతీగా ఉన్న అల్లూరును నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు సమీపంలో ఉన్న సింగపేట, నార్తుమోపూరు పంచాయతీలను విలీనం చేస్తూ 2020 డిసెంబర్‌ 30న గవర్నర్‌ ఆర్డినెన్స్‌ నంబర్‌–17తో గెజిట్‌ ప్రకటించారు. అయితే తొలిసారిగా మున్సిపాలిటీ హోదా లభించి పాలకవర్గంలో సర్పంచ్‌ స్థాయి నుంచి చైర్మన్‌, వార్డు సభ్యుల నుంచి కౌన్సిలర్‌ స్థాయిలో తొలిసారి ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించిన తరుణంలో 2021లో నార్త్‌ మోపూరుకు చెందిన టీడీపీ నేత నెల్లూరు నిరంజన్‌రెడ్డి గ్రామస్తులతో కలిసి నార్తు మోపూరును అల్లూరు నగర పంచాయతీలో విలీనం చేయొద్దని కోర్టును ఆశ్రయిండంతో నగర పంచాయతీ ఎన్నికలకు బ్రేక్‌ పడింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి నార్తుమోపూరును పంచాయతీగానే ఉంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కోర్టులో కేసు విత్‌డ్రా చేసుకుంటేనే సాధ్యమవుతుందని చెప్పడంతో ఆ విధంగా కేసును వాపస్‌ తీసుకున్నారు. ఈ క్రమంలో హైకోర్టు కేసులు కొట్టేయడం, ఎన్నికలు షురూ అని అందరూ భావించారు. అయితే ప్రక్రియ ప్రారంభమైన తరుణంలో చివరి క్షణంలో ఎన్నికల నోటిఫికేషన్‌ నిలిచిపోవడంతో అనిశ్చితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement