● మన చేతులు.. మన భవిష్యత్
● 20 సెకన్ల అలవాటుతో
ఆరోగ్యానికి భరోసా
నేడు గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే
నెల్లూరు (అర్బన్): చేతులు కడుక్కోవడం చిన్నపనే కదా అని నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ఈ చిన్న అలవాటే అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. కరోనా మహమ్మారి చేతుల పరిశుభ్రత ప్రాధాన్యాన్ని గుర్తుచేసింది. అయితే ఆ తర్వాత చాలామంది ఈ అలవాటును నిర్లక్ష్యం చేస్తున్నారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల బాక్టీరియా, వైరస్ల ద్వారా వ్యాపించే పలు ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది అక్టోబర్ 15వ తేదీన నిర్వహించే ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం (గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే)గా ప్రకటించింది. జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి.
ఎంతో కీలకం
వివిధ వస్తువులను తాకినప్పుడు వాటిపై ఉండే సూక్ష్మక్రిములు చేతులకు అంటుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత చేతులతో కళ్లు, ముక్కు, నోటిని తాకడం లేదా ఆహారం తీసుకోవడం ద్వారా అవి శరీరంలోకి ప్రవేశించవచ్చు. కేవలం నీటితో చేతులను అరకొరగా కడగడం కంటే సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు శుభ్రం చేసుకోవడం మంచిది. అరచేతులు, చేతుల వెనుకభాగం, వేళ్ల మధ్య, గోళ్ల కింద భాగాలను రుద్ది కడగాలి. అనంతరం శుభ్రమైన నీటితో కడిగి శుభ్రమైన వస్త్రంతో తుడుచుకోవాలి.
పలు వ్యాధుల నుంచి రక్షణ
చేతుల పరిశుభ్రత పాటించడం వల్ల డయేరియా, జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వారికి చిన్నప్పటి నుంచే సబ్బుతో చేతులు కడుక్కునే అలవాటు నేర్పి ంచాలి. శుభ్రమైన చేతులు వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు కూడా తోడ్పడతాయి.
ఈ సమయాల్లో తప్పనిసరి
భోజనానికి ముందు, ఆహారం తయారు చేసే ముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు, ముక్కు తుడుచుకున్న తర్వాత, జంతువులను తాకినప్పుడు, చెత్తను నిర్వహించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. చిన్నపిల్లలకు ఆహారం పెట్టే ముందు కూడా చేతుల పరిశుభ్రత పాటించాలి.
నేడు అవగాహన
వరల్డ్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా గురువారం జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
చిన్నారులకు నేర్పించాలి
చేతులు ఎలా శుభ్రం చేయాలో అనేకమందికి తెలియదు. నీళ్లలో పెట్టి శుభ్రం చేసుకున్నట్టు అనుకుంటారు. అలా కాదు. సబ్బుతో చేతులు ముందు భాగం, వెనుకభాగం, వేళ్ల సందులు, అరచేతి, మణికట్టు వరకు అర నిమిషం పాటు శుభ్రం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే చేతులకంటుకున్న బాక్టీరియాలు పోతాయి. చిన్నారులకు నేర్పించాలి. అప్పుడే అనేక రకాల జబ్బులు దరిచేరవు.
– డాక్టర్ దివ్య, అసోసియేట్ ప్రొఫెసర్, సర్వజన ఆస్పత్రి, నెల్లూరు


