నెల్లూరు(పొగతోట): పల్లెపోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో జిల్లాలో బుధవారం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. స్థానిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. 35 జెడ్పీటీసీ, 35 ఎంపీపీ, 440 ఎంపీటీసీ, 700 సర్పంచ్, 6,668 వార్డు స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. జిల్లా పరిషత్‌ను జనరల్‌కు కేటాయించారు. 35 జెడ్పీటీసీలు, ఎంపీపీ స్థానాలను నాలుగు ఎస్టీ, ఎనిమిది ఎస్సీ, ఐదు బీసీ, 18 జనరల్‌కు కేటాయించారు. ఇందులో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించారు.
19న నోటిఫికేషన్
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 19న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల కానుంది. 23 వరకు నామినేషన్ల గడువు, 24న పరిశీలన, 27న ఉపసంహరణ, నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. 5న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి ఒకే దశలో పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 26న మొదటి దశ, 29న రెండో దశ, డిసెంబర్ 2న మూడో దశ ఎన్నికల నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామగ్రి అందుబాటులో ఉంది. గత నెలలోనే బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర ఎన్నికల సామగ్రి జిల్లాకు చేరుకున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఆధారంగా బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయనున్నారు. పోలింగ్‌కు పింక్, వైట్ పేపర్లు వినియోగించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు, ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలో మాస్టర్ ట్రైనర్లకు ఇవ్వనున్నారు. అనంతరం మండలాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రణాళికాత్మకంగా ఎన్నికల ప్రక్రియ
జిల్లా వ్యాప్తంగా 12,85,840 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 6,29,342, మహిళలు 6,56,418 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్టీ ఓటర్లు 1,57,603, ఎస్సీ ఓటర్లు 2,86,110, బీసీ ఓటర్లు 5,31,327 మంది ఉన్నారు. ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గతంలో గొడవలు జరిగిన పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హిమాన్షుశుక్లా తెలిపారు. ఎక్కడైనా అల్లర్లు చేసిన, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి అభ్యర్థులు ప్రచారం చేసుకోవాలని సూచిస్తున్నారు.
19న ఎన్నికల నోటిఫికేషన్
23 వరకు నామినేషన్ల గడువు
24న పరిశీలన.. 27న ఉపసంహరణ
నవంబర్ 3న పోలింగ్.. 5న ఓట్ల లెక్కింపు
జిల్లాలో 35 జెడ్పీటీసీ, 35 ఎంపీపీ, 440 ఎంపీటీసీ, 700 సర్పంచ్, 6,668 వార్డు స్థానాలకు ఎన్నికలు
12.85 లక్షల మంది ఓటర్లు
మహిళా ఓటర్లు 6,56,418,
పురుషులు 6,29,342
అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా
జిల్లా యంత్రాంగం
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై
ప్రత్యేక దృష్టి


