కావలి: కావలి జనసేనకు చెందిన కాపు మహిళలు పలువురు బుధవారం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్సీపీలో పార్టీలో చేరారు. 33వ వార్డుకు చెందిన జనసేన నాయకురాలు కొండదాసు శిరీష ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాపు సామాజికవర్గ మహిళలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వార్డులో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. 2024 ఎన్నికల సమయంలో అనేక అబద్ధపు హామీలిచ్చారన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేశారన్నారు. దీంతో అందరూ జగన్మోహన్రెడ్డి పాలనను, చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కావలిలో మెజారిటీ వార్డులను గెలుచుకోబోతున్నామని, అదే క్రమంలో చైర్మన్‌గా వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారన్నారు.
● జనసేనలో చేరి పార్టీ కోసం కష్టపడ్డామని, వారిది కపటప్రేమని అర్థమైందని శిరీష అన్నారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి నాయకత్వం, మంచితనం చూసి పార్టీలో చేరామని వివరించారు. తెలుగుదేశం నుంచి వైఎస్సార్సీపీలో చేరిన పుట్టా శేషమ్మ మాట్లాడుతూ టీడీపీ పట్టణాధ్యక్షుడు తన పొలం విషయంలో మోసం చేశాడని చెప్పారు. ఆ విషయం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి తెలిసి కూడా న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు పార్టీలో చేరేందుకు సహకరించిన వెంకట్రావు, కల్యాణి తదితరులకు ప్రతాప్‌కుమార్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.


