నెల్లూరు సిటీ: ఆటో డ్రైవర్ హత్య కేసులో ముగ్గురు నిందితులను నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆర్టీడీ కాలనీకి చెందిన వరుణ్ అలియాస్ కర్ణ (27) ఆటో నడుపుతుంటాడు. అతడికి భార్య నాగమణి, ముగ్గురు పిల్లలున్నారు. వరుణ్ వివాదాలకు దూరంగా ఉంటాడు. ఈనెల 11వ తేదీ ఆ ప్రాంతంలోని మాతమ్మ గుడి వద్ద ఆటో బాడుగ విషయంలో మాట్లాడుతుండగా చైన్నెకి చెందిన పి.కృష్ణ, నాగరాజ్, కార్తీక్, మరో వ్యక్తి బైక్‌లపై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో అడ్డుగా ఉందని, పక్కకు తీయాలని వారు వరుణ్‌కు చెప్పారు. అతను పక్కనుంచి వెళ్లమని సూచించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపటికి వరుణ్ ఇంటికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు వెంబడించారు. అతను ఇంటి వద్ద ఆటో పార్కింగ్ చేస్తుండగా నాగరాజ్ రాయి తీసుకుని అద్దం పగులకొట్టి ముఖంపై దాడి చేశాడు. కృష్ణ కూడా గాజు ముక్కతో వరుణ్ ఛాతిపై పొడిచాడు. సమీపంలో ఉన్న భార్య, స్థానికులు కేకలు వేశారు. దీంతో నిందితులు ముందుకు వస్తే చంపేస్తామంటూ బెదిరించారు. వరుణ్‌ను వెంటాడి గాజు గ్లాసుతో పొడిచి హత్య కేసి పరారయ్యారు. వరుణ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కృష్ణ, నాగరాజ్, కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులతో ఆర్టీడీ కాలనీలోని వరుణ్‌ను హతమార్చిన ప్రాంతంలోనే పోలీసులు కవాతు నిర్వహించారు.


