● సౌత్ కోస్టల్ రేంజ్ ఐజీ
సర్వశ్రేష్ట త్రిపాఠి
నెల్లూరు(క్రైమ్): స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సౌత్ కోస్టల్ రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్హాల్లో ఆయన ఎస్పీ అజిత వేజెండ్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం ఎస్పీ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గత ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఘర్షణలు, రాజకీయ వివాదాలు, పరస్సర దాడులు జరిగిన ప్రాంతాలను పరిశీలించి సమస్యలు పునరావృత్తం కాకుండా చూడాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, గత ఎన్నికల కేసుల్లోని నిందితులను తక్షణమే బైండోవర్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, ఏఆర్ ఏఎస్పీ, డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.


