నెల్లూరు సిటీ: కళ్ల ముందే నా భర్తను హతమార్చారని వరుణ్ భార్య నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఆర్డీటీ కాలనీలో హత్యకు గురైన వరుణ్ మృతదేహానికి పోస్ట్‌మార్టాన్ని ప్రభుత్వాస్పత్రిలో సోమవారం నిర్వహించారు. మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఏ తప్పూ చేయని వరుణ్‌ను అతికిరాతకంగా చంపడమేమిటని.. పిల్లల పరిస్థితేమిటని ప్రశ్నించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. హత్య చేసిన వారికి, వారి మద్దతుదారులకు పోలీసులు రక్షణ ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. తమకు సమాధానాన్ని సైతం ఇవ్వడంలేదని ఆరోపించారు. న్యాయం చేయకపోతే ఆత్మాహుతి చేసుకుంటామని చెప్పారు. నిందితులకు మద్దతుగా వారి కుటుంబం చైన్నె నుంచి రౌడీలను తెప్పించుకున్నారని ఆరోపించారు.
నిరుద్యోగులకు
ఇంటర్వ్యూలు
నెల్లూరు(పొగతోట): ప్రైవేట్ పరిశ్రమల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గానూ ఇంటర్వ్యూలను నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. 60 మంది హాజరుకాగా, 30 మందిని ఎంపిక చేసి నియామక పత్రాలను అందజేశారు.
రైలు ఢీకొని
గుర్తుతెలియని వ్యక్తి మృతి
గూడూరు: రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి (60) మృతి చెందిన ఘటన పండ్లూరు సమీపంలో చోటుచేసుకుంది. గూడూరు రైల్వే పోలీసుల వివరాల మేరకు.. గూడూరు – నాయుడుపేట రైల్వే లైన్ మధ్య పండ్లూరు సమీపాన 117 / 10 / 12 కిలోమీటర్ పోల్ వద్ద రైలు ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారనే సమాచారం అందిందని చెప్పారు. దీంతో ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమకు సమాచారమివ్వాలని కోరారు.
దుత్తలూరులో చోరీ
దుత్తలూరు(ఉదయగిరి): దుత్తలూరులోని ఏసీ కాలనీలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. కాలనీకి చెందిన మీరావలీ ఇంటి బయట వరండాలో నిద్రించసాగారు. ఈ క్రమంలో ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి బీరువాను మారుతాళాలతో తెరిచి అందులో ఉన్న పది సవర్ల బంగారం, 40 తులాల వెండి, రూ.40 వేల నగదును అపహరించారు. ఉదయం నిద్రలేచిన బాధితులు చోరీ విషయాన్ని నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని ఎస్సై మహేంద్ర పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
టిప్పర్‌ను ఢీకొన్న కారు
● నలుగురికి తీవ్ర గాయాలు
గూడూరు రూరల్: బస్సును తప్పించే క్రమంలో ఆగి ఉన్న టిప్పర్‌ను కారు ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన గూడూరు రూరల్ పరిధిలోని బైపాస్ సర్కిల్ సమీపంలో గల 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్సై తిరుపతయ్య వివరాల మేరకు.. యానాం నుంచి పాండిచ్చేరికి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన తోటేటి శ్రీనివాస రాజేశ్వరరావు, వికాస్, వీరారెడ్డి, సుబ్బారెడ్డిని గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఐటీడీఏ పీఓ ఆదేశాలు బేఖాతర్
నెల్లూరు(వేదాయపాళెం): ఐటీడీఏలో పాలన వ్యవస్థ గాడి తప్పింది. ఉన్నతాధికారుల ఆదేశాలు, ఉత్తర్వులను కొందరు కిందిస్థాయి అధికారులు, సిబ్బంది బేఖాతర్ చేస్తూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలోని పొదలకూరు రోడ్డులో గల గిరిజన బాలికల గురుకులంలో ప్రిన్సిపల్ కుర్చీ విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడంలో ఇక్కడి అధికారులు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారనే అంశం తేటతెల్లమవుతోంది. విధుల్లో చేరే హక్కు పూర్వ ప్రిన్సిపల్‌కు లేదని పత్రిక ప్రకటన ఇచ్చేందుకే పరిమితమవుతున్నారు. గురుకులానికి వచ్చి విధులు నిర్వర్తిస్తుంటే.. ఎఫ్ఏసీ బాధ్యతల్లో ఉన్న ప్రిన్సిపల్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సమస్యను డీటీడబ్ల్యూఓ సుజాత, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.


