నెల్లూరు(అర్బన్): తరతరాలుగా పంటలు పండించుకుంటున్న తమ భూములను డిఫెన్స్ పరిశ్రమ పేరుతో లాక్కోవాలని చూస్తే అంగీకరించేదిలేదని దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ఆందోళనను సోమవారం చేపట్టి జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రమిచ్చిన అనంతరం రైతులు చేజర్ల పెంచలరెడ్డి, వంటేరు చెన్నారెడ్డి మాట్లాడారు. తమ గ్రామంలో మునిష్ డిఫెన్స్ కంపెనీ వారు పరిశ్రమ పెట్టేందుకు ముందుకొచ్చారని, 230 ఎకరాలను సేకరించేందుకు రైతులకు నోటీసులను అధికారులిచ్చారని వివరించారు. తమది చిన్న గ్రామమని, పట్టా భూములు కొంత ఉండగా, మరికొన్నింటిని రైతులకు పట్టాలుగా ప్రభుత్వమిచ్చిందని చెప్పారు. బోర్లు, బావుల కింద మామిడి, నిమ్మ, వరిని సాగు చేస్తున్నామని పేర్కొన్నారు. మెట్ట భూములు చాలా వరకు ఉన్నాయని, అయితే పంటలు పండే వాటినే లాక్కునేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పారిశ్రామికీకరణకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, చలపతి, విజయకుమార్, విద్యాచరణ్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన కబడ్డీ పోటీలు
నూజివీడు: క్రీడల్లో రాణించడం ద్వారా క్రీడాకారులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు పేర్కొన్నారు. స్థానిక ఎల్ఆర్డీ స్పోర్ట్స్ అండ్ డిఫెన్స్ అకాడమీ, ఏపీ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ – 16 బాలబాలికల ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ పోటీలు ముగిశాయి. బాలుర విభాగంలో నెల్లూరు జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. అనంతరం బహుమతులను అందజేశారు.


