● ఎస్పీ అజిత వేజెండ్ల
నెల్లూరు(క్రైమ్): సమస్యల విషయంలో చట్ట పరిధిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్పీ అజిత వేజెండ్ల పేర్కొన్నారు. నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. తమ సమస్యలపై వినతులను 162 మంది అందజేశారు. వీటిని పరిశీలించిన ఎస్పీ.. ఆయా ప్రాంత పోలీస్ అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక నేరాలు, పిల్లలు పట్టించుకోవడంలేదని తదితరాలపై వినతులు అధికంగా వచ్చాయి. ఏఎస్పీ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, డీటీసీ డీఎస్పీ గిరిధర్, మహిళా పోలీస్స్టేషన్, పీసీఆర్ ఇన్స్పెక్టర్లు సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి, భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● అదనపు కట్నం కోసం భర్త, అత్తామామలు వేధిస్తున్నారని, విచారణ జరిపి చర్యలు చేపట్టాలని నెల్లూరు రూరల్ మండలానికి చెందిన ఓ వివాహిత కోరారు.
● తన కుమార్తె ఈ నెల ఏడు నుంచి కనిపించడంలేదని, స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారని, విచారణను వేగవంతం చేసి ఆచూకీని కనుగొనాలని వింజమూరుకు చెందిన మహిళ అభ్యర్థించారు.
● కోవూరుకు చెందిన జయంత్కుమార్ తనకు తెలియకుండా ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా రూ.16 లక్షలను తీసుకొని మోసగించారని, ఆయనపై చర్యలు చేపట్టాలని కావలికి చెందిన ఓ వ్యక్తి విన్నవించారు.
● తనను, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని వాట్సాప్ గ్రూప్లో అసభ్యకర సందేశాలను పోస్ట్ చేసిన శ్రీహరిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సీతారామపురం మండలం దేవిశెట్టిపల్లి మాజీ సర్పంచ్ సుధాకర్నాయుడు కోరారు.


