నెల్లూరు రూరల్: నెల్లూరు మున్సిపల్ కమిషనర్ నియామకంలో నిబంధనలను ఉల్లంఘించారని, అర్హత లేని అధికారికి బాధ్యతలను అప్పగించి కార్పొరేషన్ వ్యవహారాలను గందరగోళంలోకి నెట్టారని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. నగరంలోని పార్టీ సిటీ కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. గతంలో కమిషనర్లుగా పనిచేసిన దినేష్‌కుమార్, వికాస్ మర్మత్, హరిత, జాహ్నవి, సూర్యతేజ నిబద్ధతతో వ్యవహరించారని తెలిపారు. ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న నందన్‌కు ఆ స్థాయి బాధ్యతలు చేపట్టేందుకు అవసరమైన అర్హతల్లేవని ఆరోపించారు. కార్పొరేషన్ జనాభా, బడ్జెట్ తదితర ప్రమాణాల ఆధారంగా కమిషనర్ స్థాయిని నిర్ణయిస్తారని గుర్తుచేశారు. ఐఏఎస్ సూర్యతేజ బదిలీ అనంతరం నందన్‌కు బాధ్యతలు అప్పగించేలా ఒత్తిడి జరిగిందని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు నందన్‌ను ఇన్‌చార్జిగా గతేడాది ఏప్రిల్ 17న నియమించారని, పూర్తి అధికారాలను అదే నెల 21న ఇవ్వాలని ఆయన కోరగా, 24 గంటల్లోనే అప్పగించారని ఆరోపించారు. సాధారణంగా ఇన్‌చార్జి బాధ్యతలు పరిమిత కాలానికే ఉంటాయని, అయితే నందన్ 20 నెలలుగా కొనసాగుతున్నారని తెలిపారు. అర్హత లేని వ్యక్తిని కమిషనర్‌గా నియమించడంపై హైకోర్టును ఆశ్రయించనున్నామని తెలిపారు. ఈఆర్వో, ఏఈఆర్వోల నియామకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నామని చెప్పారు. అర్హత లేని అధికారితో జరిగిన సంతకాలు, నిధుల వినియోగంపై సమగ్ర విచారణను జరిపించాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్లో ఖర్చయ్యే ప్రతి రూపాయికి జవాబుదారీతనం ఉండేలా పోరాడతామని స్పష్టం చేశారు.
పన్నుల వసూళ్ల పేరుతో వేధింపులు
కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగం, అవినీతి జరుగుతోందని ఆరోపించారు. పన్నుల వసూళ్ల పేరుతో ప్రజలను వేధిస్తున్నారని, రాజకీయ కారణాలతో భవనాల నిర్మాణాలను అడ్డుకుంటున్నారని చెప్పారు. మంత్రి నారాయణకు సంబంధించిన వ్యవహారాల్లోనూ పలు ఆరోపణలున్నాయని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయ నిర్మాణానికి కాలువ పొరంబోకు భూమిని కేటాయించడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బస్సుల కొనుగోలులో అవినీతి
వీఆర్ హైస్కూల్ కోసం పది బస్సుల కొనుగోలుకు కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి రూ.ఐదు కోట్ల వరకు వెచ్చించేందుకు అనుమతి పొందారని తెలిపారు. వీటికి గానూ తాము కొటేషన్‌ను కోరగా, అది రూ.3.82 కోట్లుగా ఉందన్నారు. మొత్తం రూ.4.5 కోట్లను ఖర్చు చేయనున్నారని, ఇందులో రూ.68 లక్షల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అసలు ధర, టెండర్ ప్రక్రియపై పూర్తి వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. వీఆర్ స్కూల్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం, అల్పాహారం కోసం నిధులను భారీగా ఖర్చు చేశారని, అద్దెల రూపంలో ఒక్కో బస్సుకు నెలకు దాదాపు రూ.నాలుగు లక్షలను చెల్లిస్తున్నారన్నారు. మొక్కలు, స్వీపింగ్ మెషీన్లు, కాంపాక్టర్లు, వాటర్ ట్యాంకుల పెయింటింగ్, పాఠశాల భవనాల పనుల్లోనూ అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
నిర్మాణ రంగం సంక్షోభంలోకి
24 గంటల్లో భవన నిర్మాణ అనుమతులిస్తామని మంత్రి ప్రకటించినా, ఆచరణలో పరిస్థితి భిన్నంగా ఉందని విమర్శించారు. 300 చదరపు మీటర్లలోపు భవన నిర్మాణాలకు అనుమతుల విషయంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో డబ్బులు వసూలు చేసినా, దరఖాస్తుల్లో సగం కూడా పరిష్కారం కాలేదని ఆరోపించారు. దీంతో నిర్మాణ రంగం తీవ్రంగా దెబ్బతినిందని ఆందోళన వ్యక్తం చేశారు.
కమిషనర్ నియామకంలో
నిబంధనల ఉల్లంఘన
కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలి
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి


