మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 518 బేళ్లను గురువారం విక్రయించారని నిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. వేలానికి 593 బేళ్లు రాగా, వీటిలో 75ను తిరస్కరించామని చెప్పారు. 70,425.9 కిలోల పొగాకును విక్రయించగా, రూ.1,35,389,52.80 వ్యాపారం జరిగిందని వివరించారు. గరిష్టంగా రూ.251.. కనిష్టంగా రూ.110.. సగటు ధర రూ.192.24గా నమోదైందని పేర్కొన్నారు. పది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారన్నారు.
కిలో పొగాకు గరిష్ట ధర రూ.250
కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.250 లభించింది. సాధారణ క్లస్టర్‌కు చెందిన రైతులు 674 బేళ్లను తీసుకురాగా, 593ను కొనుగోలు చేయగా, వివిధ కారణాలతో 81 తిరస్కరణకు గురయ్యాయి. కనిష్టంగా రూ.110.. సరాసరి కిలోకు రూ.190.39 లభించిందని వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ చెప్పారు. 12 కంపెనీలు హాజరయ్యాయని వివరించారు.
పీజీలో ప్రవేశాలకు
కౌన్సెలింగ్ ప్రారంభం
వెంకటాచలం: కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, కావలి కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమైందని వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ హనుమారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 11 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని.. 12 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశముందని చెప్పారు. 15న వెబ్ ఆప్షన్లలో మార్పులు.. 17న సీట్లను కేటాయించనున్నామని పేర్కొన్నారు.
మధ్యవర్తిత్వంపై
అవగాహన అవసరం
నెల్లూరు (లీగల్): మధ్యవర్తిత్వంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నరసింహమూర్తి పేర్కొన్నారు. మధ్యవర్తిత్వ విధానంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్‌లో గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, ఇరుపక్షాల మధ్య సయోధ్య సాధించే అంశాలపై ప్రత్యేక శిక్షణను అందించామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మశ్రీ తెలిపారు. శిక్షకుడు అరుణాచలం, లోక్ అదాలత్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ టంగుటూరు గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
16న ఉద్యోగుల
ప్రత్యేక గ్రీవెన్స్
నెల్లూరు రూరల్: ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్స్‌ను ఈ నెల 16న నిర్వహించనున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కార్యక్రమం జరగనుందని చెప్పారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తమ వినతులు, ఫిర్యాదులను సమర్పించాలని కోరారు.


