పోరుబాట పట్టి.. గళమెత్తి | - | Sakshi
Sakshi News home page

పోరుబాట పట్టి.. గళమెత్తి

Oct 9 2026 12:14 AM | Updated on Oct 9 2026 12:14 AM

నెల్లూరు(అర్బన్‌): వైద్యశాఖలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది పోరుబాట కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గళమెత్తారు. స్టాఫ్‌ నర్సులు, ఎల్టీలను, ఫార్మసిస్టులను, ఇతర టెక్నీషియన్లను రెగ్యులర్‌ చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతోంది. అందులో భాగంగా జిల్లాలో సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, ఆత్మకూరు జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న స్టాఫ్‌నర్సులు, వైద్యసిబ్బంది నెల్లూరులోని సర్వజన ఆస్పత్రికి వచ్చి పోరాటంలో పాల్గొంటున్నారు. గురువారం వైద్యసిబ్బంది మోకాళ్లపై నడుస్తూ వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రూత్‌గ్రేస్‌ మాట్లాడుతూ పది, పదిహేనేళ్లుగా వైద్యశాఖలో పని చేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేదన్నారు. తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. రోగులకు సేవ చేస్తున్నామని, దానికి గుర్తింపు కావాలని కోరుతున్నామన్నారు. రెగ్యులర్‌ వారిలాగే మెరిట్‌ ప్రాతిపదికన ఎంపికై , ఇంటర్వ్యూకు హాజరై, డీఎస్సీ కమిటీ ద్వారా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ద్వారా ఉద్యోగం పొందామన్నారు. అయినా ప్రభుత్వం తమను చిన్నచూపు చూడటం బాధాకమన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు రూల్స్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదన్నారు. ఈఎస్‌ఐ, సెలవులు వంటివి లేకపోవడం దారుణమన్నారు. నెలరోజులకు పైగా వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. దీంతో విధిలేని పరిస్థితిల్లో తాము పోరాటాన్ని ఎంచుకున్నామన్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. రెగ్యులర్‌ చేయాలనే ఏకై క అజెండాతో ఉద్యమం సాగుతుందని తెలిపారు.

● ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, జిల్లా కార్యదర్శి యామాల మధు విచ్చేసి ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతారాహిత్యాన్ని ఎండగట్టారు. వైద్య ఉద్యోగులకు తమ మద్దతు ప్రకటించారు. ఏపీ ఎన్జీఓ నాయకులు కూడా సమ్మెకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్‌ శరత్‌బాబు, కన్వీనర్‌ ఎండీ షాజి, కోశాధికారి రత్న, నాయకులు లీలా కుమారి, రవితేజ, గోపీకృష్ణ, శ్రీలత, వీరనారాయణ, జగదీష్‌, సుసన్న, హేమలత, జ్యోష్ణ తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న

కాంట్రాక్ట్‌ సిబ్బంది ఆందోళన

మోకాళ్లపై నడున్తూ నిరసన

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రోగులకు

అందని వైద్యసేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement