● వైద్య విద్యార్థుల నుంచి గుంజుతూ..
● ఎగ్జామినర్ల వసతుల పేరిట దోపిడీ
● ప్రిన్సిపల్, వర్సిటీ అధికారులకు ఫిర్యాదులు
నెల్లూరు(అర్బన్): రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించే అంశాన్ని నేర్పాల్సిన కొంతమంది ప్రొఫెసర్లే వైద్య విద్యార్థులను నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు నగరంలోని ఏసీఎస్సార్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గుప్పుమంటున్నాయి. ఫైనలియర్ చదువుతున్న స్టూడెంట్స్‌కు ఫొరెన్సిక్ విభాగంతో పాటు మరో విభాగానికి సంబంధించిన పార్ట్ – 1 పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎగ్జామినర్లకు వసతుల పేరుతో వీరి నుంచి నగదును ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌కు మెయిల్ ద్వారా విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఈ దందా బయటకొచ్చింది.
సిబ్బంది సహకారం
రూ.2700 చొప్పున 171 మంది నుంచి రూ.4,61,700 మేర వసూలు చేశారు. ఇవే కాకుండా రకరకాల పేర్లతో మధ్యమధ్యలో కొందరు ప్రొఫెసర్లు డబ్బులు గుంజుతున్నారని, దీనికి కళాశాల కార్యాలయ సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిసారి ఇలా వ్యవహరిస్తే ఎలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
విచారణను సవ్యంగా జరపాలి
ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రిన్సిపల్ రాజేశ్వరి ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. గతంలోనూ ఫొరెన్సిక్ విభాగంపై అనేక ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంకై ్వరీని సవ్యంగా జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వీరిపై చర్యలు చేపట్టి అక్రమ వసూళ్లకు అడ్డుకట్టేయాలని కోరుతున్నారు.


