● ఆలయ అధికారుల ప్రోటోకాల్ ఉల్లంఘన
చిట్టమూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో దేవదాయ శాఖ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘించడంలో అధికారులు ముందున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలతో పాలకమండళ్లు ఏర్పాటైన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పార్లమెంట్ స్థాయి ప్రజాప్రతినిధిని విస్మరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవల గూడూరు, చిల్లకూరు మండలాల్లోని పలు ఆలయాల్లో నిర్వహించిన కుంభాభిషేక వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు, వాల్‌పోస్టర్లలో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి పేరును నమోదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా చిట్టమూరు మండలం మల్లాంలోని ప్రసిద్ధ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, వాల్‌పోస్టర్లలోనూ ఎంపీ పేరును ప్రస్తావించలేదు. ఆలయంలో బుధవారం వాటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పేరు ఎందుకు ముద్రించలేదని ఈఓ కుడారి పెంచల వరప్రసాద్‌ను ప్రశ్నించగా.. తనకు తెలియకుండానే ఆహ్వాన పత్రికలు ముద్రించారని సమాధానం ఇచ్చారు.


