● ఏఐవైఎఫ్ నేతలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): సీఎం చంద్రబాబు జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మరోసారి మోసం చేశాడని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మున్నా విమర్శించారు. నెల్లూరులోని సంతపేటలో ఉన్న సీపీఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ హామీ ఇచ్చారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని, అదేవిధంగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాయమాటలు చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను మోసం చేశాడని ఆరోపించారు. ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలిస్తామని, ప్రతి ఏడాది జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ద్వారా ఇస్తామని చంద్రబాబు, లోకేశ్‌లో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నేడు 10,060 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ నెలలో విడుదల చేస్తామని చెప్పడం దారుణమన్నారు. అక్టోబర్‌లో నోటిఫికేషన్ వస్తే డీఎస్సీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. వెంటనే 50 వేల పోస్టుల ప్రక్రియను జాబ్ క్యాలెండర్ ద్వారా చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే లోకేశ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు బాదుల్లా, మీరా, గౌస్‌బాషా, షాన్‌వాజ్, సుబ్బరాయుడు, వాసుదేవరెడ్డి, శిరీషా తదితరులు పాల్గొన్నారు.


