నేరాలతో అట్టుడుకుతున్న నెల్లూరు | - | Sakshi
Sakshi News home page

నేరాలతో అట్టుడుకుతున్న నెల్లూరు

Mar 24 2026 6:54 AM | Updated on Mar 24 2026 6:54 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: జిల్లా పోలీస్‌ యంత్రాంగం ముందు సినిమా డైరెక్టర్లు సైతం దిగదుడుపే. అధికార పార్టీ నేతలను కంటికి రెప్పలా కాపాడుతూ.. ప్రజలను, శాంతిభద్రతలను గాలికి వదిలేశారు. జిల్లాలో హత్యలు, లైంగిక దాడులు జరిగినా.. టీడీపీ నేతలు నేరాల్లో చిక్కుకున్నా.. అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నా.. వారిని రక్షించేందుకు అప్పటికప్పు డు.. పొంతనలేని కట్టుకథలు అల్లడంలో కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌లో అరితేరిపోతున్నారు. టీడీపీ నేతలు ఇటు తప్పులు చేయడం అటు దొరికిపోతే.. పోలీసు లు మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. సంచలన ఘటనలు జరిగిన ప్రతిసారి.. టాపిక్‌ డైవర్షన్‌ చేస్తున్నారు. తాజాగా నెల్లూరు నగరంలోని బోడిగాడితోట శ్మశాన వాటికలో సగం కాలిన మృతదేహం బయటపడడం సంచలనంగా మారింది. ఆ వెంటనే పోలీసులు ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే ఆత్మహత్యేనంటూ హడావుడిగా ప్రకటన చేయడంతో పాటు మీడియా దృష్టిని మరల్చేందుకు హడావుడిగా లాడ్జీల్లో దాడులు చేశారు. అయితే లాడ్జీల్లో వ్యభిచరిస్తూ భారీ సంఖ్యలో జంటలు పట్టుబడడం, ఇందులో టీడీపీ నేత ఉండడంతో ఇది సంచలనమైంది. ఒక సంచలన ఘటనను కప్పిపుచ్చబోయి.. మరో సంచలన ఘటన వెలుగులోకి రావడంతో పోలీసుల పరిస్థితి గొంతులో వెలక్కాయ ఇరుక్కున్నట్లు అయింది.

‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే.. దూడ గడ్డి కోసం’ అనే సామెత చందానా ఉంది.. లాడ్జీలో వ్యభిచరిస్తూ పట్టుబడిన ఓ టీడీపీ నేత పరిస్థితి. పక్కాగా విటులతో అడ్డంగా దొరికిపోతే.. లాడ్జీల్లో టీడీపీ కార్యకర్తల మీటింగ్‌కు వచ్చాడని, ఆస్పత్రికి ట్రీట్‌మెంట్‌ కోసం వచ్చాడంటూ ఇలా పొంతనలేకుండా పోలీసులతోనే చెప్పించి నవ్వుల పాలయ్యారు. నెల్లూరు నగర ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో చిన్నబజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాలుగు లాడ్జీలపై ఆదివారం పోలీస్‌ అధికారులు ఆకస్మిక దాడులను చేపట్టారు. సాయిగ్రాండ్‌ లాడ్జీలో వెంకటాచలం మండలం నిడుగుంటపాళేనికి చెందిన టీడీపీ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అత్యంత ఆప్తుడు, చవటపాళెం ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడు రావూరు రాధాకృష్ణనాయుడు ఓ మహిళతో వ్యభిచరిస్తూ పట్టుబడిన విషయం విదితమే. అయితే ఆ వ్యక్తి టీడీపీ నేత అని పోలీసులకు తెలియకపోవడంతో పట్టుకెళ్లి స్టేషన్‌లో విటుల మధ్యలోనే కూర్చోబెట్టారు. ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో సదరు వ్యక్తి టీడీపీ నేతగా తెలియడంతో పోలీసులపై రాజకీయ ఒత్తిడి పెరిగింది. సదరు తమ్ముడిని తప్పించేందుకు ఆస్పత్రికి వచ్చి సేదదీరేందుకు లాడ్జీకి వచ్చాడని, ఆస్పత్రికి వెళ్లినట్లు తమ విచారణలో తేలడంతో వదిలేశామంటూ ఓ పోలీస్‌ అధికారి చేసిన ప్రకటనతో ఆ శాఖ నవ్వుల పాలైంది. వెంకటాచలం మండలం నిడిగుంటపాళేనికి చెందిన రావూరు రాధాకృష్ణనాయుడు ప్రస్తుతం నెల్లూరు నగరంలోనే నివాసం ఉంటున్నాడు. టీడీపీ కార్యకర్తలను కలిసేందుకు వచ్చాడంటూ.. ఏదో జరుగుతుందని చూసేందుకు వచ్చాడంటూ ఇలా రకరకాల ప్రచారం చేశారు. నెల్లూరులోని కాపురం ఉంటున్న ఆయన ఆస్పత్రికి వచ్చి లాడ్జీలో సేదదీరుతున్నాడంటూ పోలీసులు చేసిన ప్రకటన ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. తమ్ముళ్లను కాపాడేందుకు పోలీసులు పడుతున్న ఆపసోపాలు చూసి జనం నవ్వుతున్నారు.

జిల్లా మత్స్యకారులు తమ జీవనోపాధిని కొల్లగొట్టుతున్న తమిళ జాలర్ల మెకనైజ్డ్‌ బోట్లను ప్రాణాలకు తెగించి పట్టుకుని వారి అహంకారానికి సవాల్‌ విసిరారు. ఆ బోట్లను పోలీస్‌ శాఖకు అప్పగించి వారు సైతం కాపలాగా ఉన్నారు. కానీ టీడీపీ పెద్దలు మత్స్యకారులకు ద్రోహం తలపెట్టి ఆ సామాజిక వర్గ కులపెద్దలను తాయిలాలతో లోబరుచుకుని బోట్లను రాత్రికి రాత్రే విడుదల చేయించారు. మత్స్యకారులకు అండగా ఉండాల్సిన పోలీస్‌ శాఖ ఈ కుట్రకోణంలో భాగస్వామ్యం కావడం ఆ శాఖ ప్రతిష్టకే మాయని మచ్చగా మారింది. ఆరు రోజులుగా తమకు ద్రోహం చేసిన మత్స్యకారుల పెద్దలను తాళ్లతో నిర్బంధించి నిజాలు రాబట్టారు. దీంతో ఈ వ్యవహారం వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దల పేర్లు, పోలీసు అధికారుల పేర్లు బయటకు వచ్చాయి. ప్రస్తుతం తీర ప్రాంతంలోకి పోలీసులు అడుగుపెట్టడానికి కూడా సాహసించలేకపోతున్నారు. తమిళబోట్ల వ్యవహారం బూమ్‌రాంగ్‌ కావడంతో టీడీపీ నేతలను కాపాడేందుకు సినీ ఫక్కీ డ్రామాకు తెరతీశారు. ప్రభుత్వ పెద్దలకు, టీడీపీ నేతలకు మద్దతుగా ఎవరైనా అక్కడ అడుగు పెడితే.. ఏమి జరుగుతుందో తెలియడంతో పోలీసులు సరికొత్త డ్రామాకు తెరతీశారు. మత్స్యకారులకు ఇక నుంచి అండగా ఉంటామంటూ రాయబేరాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే తీరం పరిస్థితులు అంచనాకు వెళ్లిన క్రమంలో తీరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే తమిళ జాలర్ల మెకనైజ్డ్‌ బోటు రావడంతో చుట్టుముట్టి పట్టుకున్నామంటూ హడావుడి చేశారు. గతంలో ఎన్నోసార్లు మత్స్యకారులు తమ ప్రాణాలకు తెగించి తమిళ జాలర్ల బోట్లను నిర్బంధించినా.. ఎన్నడూ తీర ప్రాంతం ముఖం చూడని అధికారులు.. ఇప్పుడు ఏకంగా మత్స్యశాఖ కమిషనరే రావడం, వచ్చీరాగానే బోటును పట్టుకోవడం, ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేయడం చూస్తుంటే.. ఒక సినిమాటిక్‌గా ఉంది. అధికారులు, పోలీసుల డ్రామాలను తెలుసుకున్న మత్స్యకారులు మరింత ఆగ్రహవేశాలతో రగిలిపోతున్నారు.

ఏందబయా

ఈ రోజు న్యూస్‌

లాడ్జీ

అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేత

తప్పులు చేసే తమ్ముళ్లను కాపాడేందుకు అష్టకష్టాలు

వీరి ముందు సినిమా డైరెక్టర్లు కూడా

దిగదుడుపే

వ్యభిచారం కేసులో టీడీపీ నేత పక్కాగా పట్టుబడితే ఆస్పత్రికి వచ్చాడంటూ నవ్వులపాలు

తమిళ బోట్ల వ్యవహారం బూమ్‌రాంగ్‌ కావడంతో టీడీపీ నేతలను కాపాడేందుకు కొత్త డ్రామా

మత్స్య శాఖ ఆధీనంలోని బోటును తెచ్చి ఇదిగో తమిళ బోటు పట్టేశామంటూ హడావుడి

బోడిగాడితోట శ్మశాన వాటికలో అనుమానాస్పదస్థితిలో సగం కాలిన మహారాష్ట్ర వాసి మృతదేహం

ప్రాథమిక విచారణ చేపట్టకుండానే హడావుడిగా ఆత్మహత్య అంటూ ప్రకటన

నగరంలో రెచ్చిపోతున్న రౌడీయిజం.. కత్తులతో హల్‌చల్‌ చేస్తున్నా

చేష్టలుడిగి చూస్తున్న వైనం

అటు టీడీపీ నేతల అరాచకాలు.. పోలీసుల శాంతిభద్రతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆపసోపాలు

అనుమానాస్పద మరణాలు.. విస్మయ ప్రకటనలు

నెల్లూరు స్వర్ణాల చెరువులో రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో ఒక మృతదేహం లభ్యమైంది. ఆ మరుసటి రోజే బోడిగాడి తోట శ్మశాన వాటికలో మహారాష్ట్ర నాగపూర్‌కు చెందిన ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పదంగా సగం కాలిన స్థితిలో బయటపడింది. వరుస ఘటనలు జరగడంతో మీడియా దృష్టి అనుమానాస్పద మరణాలపై పడడంతో పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టకుండానే అది ఆత్మహత్య అంటూ పోలీస్‌ శాఖ ప్రకటన చేయడం విస్మయాన్ని కలిగించింది. ఎవరైనా శ్మశాన వాటికలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాడా? ఒక వేళ శరీరానికి నిప్పంటించుకుంటే సగభాగం వరకే కాలుతుందా?.. మరి అతను ఆత్మహత్యకు ఉపయోగించిన మెటీరియల్‌ను గుర్తించారా?.. ఇలా ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రాథమిక ఆధారాలేవీ పరిశీలించకుండానే.. ఇది హత్య అయితే ఎక్కడ పోలీస్‌ ఫెయిల్యూర్‌ కనిపిస్తుందోనని ముందుగానే ఆత్మహత్యగా ప్రకటన చేయడం చూస్తుంటే.. పోలీస్‌శాఖ అసమర్థత, శాంతిభద్రతల వైఫల్యాలు, డైవర్షన్‌ కట్టుకథలు కనిపిస్తున్నాయి.

జిల్లాలోని పోలీస్‌ వ్యవస్థ.. అధికార పార్టీని భుజస్కంధాలపై వేసుకుని అభాసుపాలవుతోంది. మద్యం, గంజాయి విచ్చలవిడి అక్రమ అమ్మకాలను కట్టడి చేయలేకపోతున్నారు. నేరస్తులు జూలు విదిలించి..రౌడీయిజం, హత్యలు చేస్తున్నా నియంత్రించలేకపోతున్నారు. టీడీపీ నేతలకు ఏ కష్టం వచ్చినా.. ప్రభుత్వానికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మసిపూసి మారేడు కాయ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అధికార పార్టీ నేతల అరాచకాలను, ప్రకృతి సంపద దోపిడీలను, అసాంఘిక కార్యకలాపాల చర్యలను, శాంతిభద్రతల వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఆపసోపాలు పడుతున్నారు. తప్పులు చేసే పచ్చ నేతలు ప్రజల్లో పలచ బడకుండా.. సినిమా డైరెక్టర్లను మించి అప్పటికప్పుడే కట్టుకథలు అల్లేస్తున్నారు.

నెల్లూరు నగరం నేరాలతో అట్టుడికిపోతోంది. ఓ వైపు రౌడీ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. ఇంకో వైపు గంజాయి బ్యాచ్‌లు తగ్గడం లేదు. మరో వైపు హత్యలు, మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీస్‌శాఖ తామేదో చేస్తున్నట్లు హడావుడి తప్పా రౌడీ మూకల పీచమణచడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. గత నెల రోజులుగా కొన్ని వర్గాలుగా విడిపోయి గ్యాంగ్‌ వార్‌కు తెగబడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి కత్తులతో వీరంగం చేశారు. ముగ్గురు యువకులను పొడిచారు. అందులో ఒకరికి కడుపులో పేగులు కూడా బయటకు వచ్చాయి. ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చావుబతుకులతో పోరాటం చేస్తున్నారు. నెల రోజులుగా గ్యాంగ్‌వార్‌లు జరుగుతున్నా.. పోలీస్‌ శాఖ కనిపెట్టలేకపోవడం గమనార్హం. రెండు రోజుల క్రితం డీమార్ట్‌ షోరూం పక్కన యువత గొడవ పడి వీరంగం చేశారు. ఏటీఎంలా మద్యం ఎనీటైం దొరుకుతోంది. లాడ్జీలు, దాబాల్లో తనిఖీలు చేయడం కాదు. ఎనీటైం దొరికే మద్యం, గంజాయి అమ్మకాలను నిరోధించే దమ్ము ఆ శాఖలో ఏకోశానా కనిపించడం లేదు. అధికార పార్టీ నేతల మాటలను చట్టాలుగా చేసుకొని రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీని టార్గెట్‌ చేసి అక్రమ కేసులతో పోలీస్‌ శాఖ చెలరేగి పోతుంది తప్ప లా అండ్‌ ఆర్డర్‌ను కంట్రోల్‌చేయడంలో మాత్రం చేష్టలుడిగి చూస్తోంది. వారం రోజులుగా జిల్లాలో జరిగే కొన్ని పరిణామాలు చూస్తుంటే పోలీస్‌ శాఖ తప్పిదాలు జిల్లా పరువు ప్రతిష్టకే భంగం కలిగిస్తున్నాయి.. మత్స్యకారుల బోట్ల విడుదల నుంచి టీడీపీ నేత వ్యభిచార వ్యవహారం వరకు అన్ని విషయాల్లో ఖాకీల చేష్టలు నవ్వులపాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement